అక్కన్నపేట, ఆగస్టు 3: మండలంలోని గోవర్ధనగిరి పరిధిలో సంజీవరాయుడి గుట్ట ఉన్నది. భూమి నుంచి సుమారు 1000 మీటర్ల ఎత్తులో గుట్ట ఉంటుంది. ఈ గుట్టపైన ఒక బండకు హనుమాన్ విగ్రహం, వెనుక వైపు బండల నడుమ సంజీవరాయుడి విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు హనుమాన్తో పాటు రెండు బండల నడుమ ఉన్న సంజీవరాయుడిని దర్శించుకుంటారు.
హనుమాన్ విగ్రహం వద్ద వినాయకుడితో పాటు శివలింగం, నంది విగ్రహాలు ఉన్నాయి. గుట్టపైన కోనేరు (గుండం) ఉంది. కాలంతో సంబంధం లేకుండా ఈ కోనేరులో నిత్యం నీరు ఉండ టం ఇక్కడ విశేషం. గుట్ట దిగువ భాగంలో సమ్మక్క-సారలమ్మ, మరో కొద్ది దూరం లో మల్లికార్జునస్వామి, పక్కనే ఎల్లమ్మతల్లి పుట్ట, వేప చెట్టు కింద పోచమ్మతల్లి ప్రతిమలు ఉన్నాయి.
గుట్ట పై నుంచి చూస్తే కల్కిదేవిగుడి, కల్కి చెరువు, చామంతులదేవి ఆలయం కనిపిస్తున్నది. చాళ్యుకుల పాలనలో గుట్ట పడుమర భాగంలో ఉన్న రేగొండ దర్వాజ నుంచి ఉప్పుగర్జా వరకు సొరంగం, అక్కడి నుంచి మరో సొరంగం ద్వారా కల్కిచెరువులోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వారని స్థానికులు చెబుతుంటారు. గుట్టపైన కోట గోడ రాతి కట్టడంతో పాటు గుట్టు చుట్టూ నేటికీ చెక్కుచెదరని దేవాలయాలు కనిపిస్తాయి.
ఈ గుట్టకు నాలుగు దిక్కులా కల్కి, చామంతుల, నక్కలకుంట, తాళ్లకుంట అనే చెరువులు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఈ గుట్టపై నుంచి చూస్తే కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. శ్రావణమాసంలో ప్రతి సోమ, మంగళ, శుక్ర, శని వారాల్లో గుట్టపై భక్తలతో పాటు పర్యాటకుల సందడి నెలకొంటున్నది.
