ఈఎస్ఐ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఈఎస్ఐ దవాఖానలో రూ.20.72 కోట్లతో ఆధునీకరించిన బ్లాక్‌లను బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పటాన్చెరు పారిశ్రామికవాడ మినీ ఇండియా అని, ఇక్కడ దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు పరిశ్రమల్లో పనిచేస్తున్నారన్నారు. ఈ ప్రాంత కార్మికులు, ప్రజలకు మంచి వైద్యం అందించేందుకు ఈఎస్ఐ దవాఖాన ఆధునీకరణ, పటాన్చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. పటాన్‌చెరులోని ఈఎస్ఐ డిస్పెన్సరీని 2ఎకరాల్లో నిర్మించి, 30 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. దేశంలోనే ఉత్తమ కార్మిక సంక్షేమ పాలసీని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
– పటాన్చెరు/ రామచంద్రాపురం, ఆగస్టు 3
పటాన్చెరు/ రామచంద్రాపురం, ఆగస్టు 3: కార్మిక సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఈఎస్ఐ దవాఖానలో రూ.20.72 కోట్లతో ఆధునీకరించిన బ్లాక్‌లను బుధవారం కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు పారిశ్రామికవాడ అంటేనే మినీ ఇండియా అన్నారు. దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు ఇక్కడి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారని తెలిపారు. దాదాపు 2లక్షల మంది కార్మికులున్న ఈ ప్రాంతంలో ఆధునీకరించిన 100 పడకల ఈఎస్ఐ దవాఖాన అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈఎస్ఐ దవాఖానల నిర్వహణకు నిధులకు కొరత లేదని చెప్పారు. వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో ఉన్నారని, కానీ సేవలే సరిగ్గా అందడం లేదని తాను గుర్తించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
పద్ధ్దతి మార్చుకుని సేవాభావంతో కార్మికులకు వైద్య సేవలు అందించాలని వైద్యసిబ్బందికి సూచించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు డాక్టర్లు సమాధానం ఇవ్వక పోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కోరిన 480మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆర్థిక మంత్రిగా త్వరలోనే పర్మిషన్ ఇస్తానన్నారు. కార్మికులంటేనే పేదలు ఉంటారని, అనేక రాష్ర్టాల నుంచి వస్తారని, వారికి సేవలు చేయడంలో ఎప్పుడూ ముందుండాలని డాక్టర్లకు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్యసేవలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పటాన్‌చెరులోని ఏరియా దవాఖానలో స్కానింగ్‌లు ఉచితంగా చేయించుకోవాలని సూచించారు. రక్తం కావాల్సి ఉంటే అక్కడే ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కాన్పులు పెంచాలని గైనకాలజిస్ట్‌లకు సూచించారు. ఆర్థోపెడిక్ వైద్యుల సేవలు పెంచాలన్నారు. చాలా విభాగాల్లో ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌పేషెంట్స్ ఆక్యుపెన్సీ 40శాతం మాత్రమే ఉండడంపై సూపరింటెండెంట్‌పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వంపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతున్నదని చురకలంటించారు. మంచి సేవలు అందించి రోగుల మన్ననలు పొందాలని వైద్యసిబ్బందికి సూచించారు. పరిశ్రమల్లో హెల్త్‌క్యాంప్‌లు ఏర్పాటు చేసి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాలన్నారు. 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన పటాన్చెరులో నిర్మిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్, మెట్టు కుమార్‌యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్యయాదవ్, టీఆర్ఎస్ సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, ఈఎస్ఐ దవాఖాన సూపరింటెండెంట్ సుధాకర్, డివిజన్ అధ్యక్షుడు బూన్, గోవింద్, సర్కిల్ యూత్ అధ్యక్షుడు నర్సింహ, ఈఎస్ఐ దవాఖాన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈఎస్ఐ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సేవలు
కార్పొరేటర్‌కు దీటుగా ఈఎస్ఐ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈఎస్ఐ దవాఖానలకు నిధులు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలు కార్మికులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్రంలో 18లక్షల మంది కార్మికులు వైద్యసేవలు అందుకుంటున్నట్లు చెప్పారు. పటాన్‌చెరులోని ఈఎస్ఐ డిస్పెన్సరీని 2ఎకరాల్లో నిర్మించి, 30 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఆర్సీపురంలోని 100 పడకల ఈఎస్ఐ దవాఖానను రూ. 20.72 కోట్లతో ఆధునీకరించామన్నారు. నాచారంలోని ఈఎస్ఐ దవాఖానను రూ.200 కోట్లతో ఆధునీకరించినట్లు తెలిపారు. అన్నిరకాల వైద్యసేవలు అందించేందుకు ఖర్చు విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదన్నారు. దేశంలోనే ఉత్తమ కార్మిక సంక్షేమ పాలసీని తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు.
డాక్టర్లపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ప్రశ్నల వర్షం
బెడ్స్‌పై ఎంతశాతం ఇన్‌పేషెంట్స్ ఉంటున్నారు? అంటూ మంత్రి హరీశ్‌రావు ఈఎస్ఐ సూపరింటెండెంట్‌పై సభలో ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆయన తడబడ్డారు. మంత్రి నేరుగా వారి పనితీరును అడుగుతుండటంతో హడావిడిగా దవాఖాన వైద్య సేవల వివరాలు మంత్రికి అందజేశారు. వాటిని చూసిన మంత్రి పెదవి విరిచారు. మీ దవాఖానలో డాక్టర్లు ఫుల్, సేవలు నిల్ అని అన్నారు.
మంత్రి డ్యూటీ డాక్టర్లను కూడా వారి విధులపై ప్రశ్నలు సంధించారు. గైనకాలజీ విభాగంలో ముగ్గురు డాక్టర్లు ఉన్నా నెలకు ఒక్క డెలివరీ కూడా చేయడం లేదని నిలదీశారు. సాధారణ పీహెచ్‌సీల్లో ఎంబీబీఎస్ డాక్టర్లు రోజుకు నాలుగు డెలివరీలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. దీంతో స్పందించిన గైనకాలజిస్ట్లు దవాఖాన ఆధునీకరణ పనుల వల్ల డెలివరీలు చేయలేదని తెలుపడంతో మంత్రి, దవాఖానను ఆధునీకరణ పనులు పూర్తై 8 నెలలు అవుతున్నదని గుర్తు చేశారు. తల్లులు మిమ్మల్ని తక్కువ చేయాలని నేను ప్రశ్నించడం లేదని డాక్టర్లకు వివరించారు. ఇక్కడికి వచ్చే సాధారణ కార్మికుల కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలనే ఆవేదనే తనదన్నారు. మీ దవాఖానలో ఏ నెల కూడా 50శాతం మంచి బెడ్స్ అక్యుపెన్సీ కనిపించడం లేదన్నారు.
ఎముకల డాక్టర్, కంటి డాక్టర్, ఈఎన్టీ డాక్టర్ల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 55మంది డాక్టర్లు, 56మంది స్టాఫ్నర్స్లతో ఈఎస్ఐ దవాఖాన పరిపుష్టిగా కనిపిస్తున్నదన్నారు. వైద్య సేవలు మాత్రం పెద్దగా లేవని మంత్రి అన్నారు. మీకు ఎలాంటి వసతులు కావాల్సి ఉన్నా, నిధులు కావాలన్నా అందజేస్తాం. సీటీ స్కాన్ కావాలన్నా, రక్తం కావాలన్నా పటాన్చెరు ఏరియా దవాఖానలో ఆ సేవలు ఉచితంగా అందేలా ఆదేశాలు ఇస్తాను, వాటిని వాడుకోండి. కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన సేవలు ఇవ్వండి. మీ పనితీరుతోనే ప్రజలు మాకు విలువ ఇస్తారు. దవాఖానకు ధీర్ఘకాలికంగా సెలవులు పెట్టిన నలుగురు డాక్టర్లను తొలిగించాలని మంత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. పనిచేయనివారు మనకెందుకని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి నిర్వహించిన సమీక్షతో ఈఎస్ఐ డాక్టర్ల సేవాలోపం కళ్లకు కట్టింది.
సీఎం ఆశీస్సులతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన..
– పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పటాన్‌చెరుకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరైంది. రూ.200 కోట్లతో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నాం. త్వరలోనే దానికి శంకుస్థాపన చేయనున్నాం. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, మల్లారెడ్డి సహకారంతో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు అనుమతులు వచ్చాయి. వారికి ధన్యవాదాలు. పటాన్చెరు అంటేనే మినీ ఇండియా. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ బతుకుతున్నారు. కూడు, గుడ్డ, నీడకు సమస్య లేదు. కానీ, వైద్యపరమైన ఇబ్బందులు వస్తేనే వారు దిక్కులు చూస్తున్నారు. టీఆర్ఎస్ హయాంలో కార్మికుల ఆరోగ్యానికి పూర్తి భరోసా ఏర్పడింది. ఆర్సీపురం ఈఎస్ఐను ఆధునీకరించడంతో 2లక్షల మంది కార్మికుల మేలు జరుగనున్నది.
పటాన్చెరు కార్మికుల ఆరోగ్యానికి ధీమా
– మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
పటాన్చెరు కార్మికుల అడ్డా. దేశంలోని 28 రాష్ర్టాల ప్రజలు ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. సీఎం కేసీఆర్ కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖానను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈఎస్ఐ దవాఖానలతో కార్మికుల ఆరోగ్యానికి భరోసా ఏర్పడింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి చేస్తున్న కృషితో పటాన్చెరు ప్రాంతంలో వైద్యసేవలు మెరుగయ్యాయి.
డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించండి
– భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శ్‌రెడ్డి
ఇక్రిసాట్ ఫెన్సింగ్ ఏరియాలో నివాసం ఉన్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్లలో స్థానం కల్పిస్తామని హామీనిచ్చాం. ఆ హామీ మేరకు 218మందికి మనం డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాల్సి ఉంది. మంత్రులు చొరవ తీసుకుని వారికి న్యాయం చేయాలి. మంత్రుల, ఎమ్మెల్యే సహకారంతో భారతీనగర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. అడిగిన ప్రతి పనిని మంత్రి హరీశ్‌రావు మంజూరు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈఎస్ఐ దవాఖాన సేవలు కార్మికులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.