హవేళీఘనపూర్, ఆగస్టు1: వానకాలం వచ్చిందంటే మండలంలోని రాజ్‌పేట వద్ద గంగమ్మ వాగు ఉప్పొంగి రాకపోకలు బంద్ అయ్యేవి. దీంతో రాజ్‌పేట, కొత్తపల్లి, కప్రాయిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. తిరిగి వాగు ఉధృతి తగ్గితేనే రాకపోకలు కొనసాగేవి. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా మెదక్‌కు వెళ్లలేని పరిస్థితి ఉండేది. రాజ్‌పేట బ్రిడ్జి నిర్మాణం టీడీపీ హయాంలో తూతూ మంత్రంగా నిర్వహించారు. అదీ శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉండేది. కొద్దిపాటి వర్షాలు పడినా వాగు ఉధృతి పెరిగితే ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రారంభోత్సవాలు చేసినా, నిర్మాణానికి నోచుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఈ బ్రిడ్జి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. రూ.5.50 కోట్లు నాబార్డు నిధులతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. దీంతో మెదక్ జిల్లా సరిహద్దు గ్రామాలు కొత్తపల్లి, రాజ్‌పేట, కప్రాయిపల్లి ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లా పోల్కంపేట ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం మెరుగుపడింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసినందుకు ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావుకు ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రవాణా సదుపాయం మెరుగుపడింది
గతంలో వర్షాలు కురిస్తే వాగు ఉధృతి పెరిగి రాకపోకలకు ఇబ్బందులుండేవి. దీంతో ప్రజలు తమ బాధలు ఎప్పుడు తీరుతాయా అని ఆవేదన చెందేవారు. ఈ ప్రాంత ప్రజల బాధలను గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5.50 కోట్లు ఖర్చు చేసి బ్రిడ్జి నిర్మించింది. దీంతో మెదక్ జిల్లా సరిహద్దు గ్రామాలైన రాజ్‌పేట, కొత్తపల్లి, కప్రాయిపల్లితో పాటు కామారెడ్డి జిల్లాకు వెళ్లేందుకు రవాణా సదుపాయం ఏర్పడింది. – బాల్‌రాజ్, బూర్గుపల్లి
శాశ్వత పరిష్కారం లభించింది
వర్షాకాలం వచ్చిందంటే పాత బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన చెందేవాళ్లం. వాగు ఉధృతి సమయంలో రాకపోకలు బంద్ అయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఈ బ్రిడ్జిని నిర్మించింది. దీంతో ఈ సమీప ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలిగింది. ఎంత పెద్ద వర్షాలు కురిసినా రాకపోకలకు ఇబ్బంది ఉండదు.
– సాయిలు, కొత్తపల్లి