అమీన్పూర్, ఆగస్టు 1: టీఆర్ఎస్ సర్కారు హయాంలో అమీన్పూర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన అమీన్పూర్లో సుమారు రూ.20 కోట్లతో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తూ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అమీన్పూర్ ప్రజలు గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి పరిస్థితుల నుంచి కొత్తగా మున్సిపాలిటీ, నూతన మండలంగా ఏర్పాటు చేసి ఊహించని విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చుకోవడం శుభపరిణామమన్నారు. ముంబై జాతీయ రహదారి బీరంగూడ కమాన్ నుంచి కిష్టారెడ్డిపేట్ వరకు ఉన్న రహదారిపై వాహదారులు, ప్రజలు వెళ్లాలంటే భయం పుట్టేదని, అలాంటి రహదారిని సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలో భాగంగా రూ.50కోట్లు మంజూరు చేసి, 100 ఫీట్ల రహదారిని అమీన్పూర్కే వన్నె తెచ్చేవిధంగా నిర్మించారని పేర్కొన్నారు. ప్రస్తుతం అమీన్‌పూర్‌కు మరో తీపికబురు చెప్తానని, 100 ఫీట్ల ప్రధాన రహదారికి అనుసంధానంగా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి శక్తివంచన లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. అమీన్పూర్ మండలంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందని, అందుకు పాలకవర్గాల కృషి ఎంతో ఉన్నదన్నారు.
శంకుస్థాపనలు చేసిన పనులు..
అమీన్పూర్ మున్సిపల్ మండల పరిధిలో రూ.16 కోట్ల హెచ్ఎండీ నిధుల నుంచి బీరంగూడ దేవాలయ కమాన్ నుంచి గుట్టపై భ్రమరాంబ ఆలయం వరకు సీసీ రోడ్ల నిర్మాణం, నవ్య రోడ్డు నుంచి రూప కౌంటీ మీదుగా మున్సిపల్ కార్యాలయం, గ్రీన్‌ఫీల్డ్ కాలనీ నుంచి సీంపోని హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ వరకు, బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్ నుంచి డబుల్ బెడ్ రూంల వరకు, శ్రీకృష్ణుడి దేవాలయం వద్ద వంతెన, మరి కొన్ని చోట్ల కల్వర్టు పనులకు శంకుస్థాపనలు చేశారు. మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడ, జానకంపేట్, ఐలాపూర్ తండా, ఐలాపూర్, సుల్తాన్పూర్, బొమ్మన్‌కుంట, దాయర గ్రామాల్లో సుమారు రూ.2.86 కోట్లతో సీసీ రోడ్లు, పంచాయతీ, పాఠశాల భవనాలు, మురుగునీటి కాల్వల పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో మల్లేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహ్మగౌడ్, కౌన్సిలర్లు బాసెట్టి కృష్ణ, కల్పన ఉపేందర్‌రెడ్డి, కవితా శ్రీనివాస్‌రెడ్డి, బిజిలీరాజు, చదువు మల్లేశ్, యూసుఫ్, సర్పంచులు కృష్ణ, భాస్కర్‌గౌడ్, నీతిషా శ్రీకాంత్, కోఆప్షన్ సభ్యులు తలారి రాములు, యూనుస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బాల్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్, కాలప్ప, నందారం రమేశ్‌గౌడ్, లింగంగౌడ్, ప్రమోద్‌రెడ్డి, సత్యనారాయణ, దాస్‌యాదవ్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.