రామాయంపేట, ఆగస్టు3: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. బుధవారం రామాయంపేట మండలం డీ.ధర్మారం పీహెచ్‌సీని కేంద్ర బృందం పర్యవేక్షించింది. దవాఖానలో క్వాలిటీ మేనేజ్మెంట్, సౌకర్యాల కల్పనపై కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ ఖుష్బుజైన్, అరుణ్‌కుమార్, దవాఖాన డాక్టర్ ఎలిజబెత్ రాణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దవాఖానలోని చికిత్సల గదులు, ఆపరేషన్ థియేటర్, కరోనా సమయంలో ఎలా పని చేశారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దవాఖానకు వచ్చిన జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ డీ.ధర్మారం ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. దవాఖానలో నార్మల్ డెలివరీల సంఖ్య కూడా పెరిగిందన్నారు. కరోనా సమయంలో డీ.ధర్మారం వైద్య సిబ్బంది చికిత్సలతో పాటు మొదటి, రెండో డోస్‌తో పాటు బూస్టర్ డోస్‌లను కూడా వేయిస్తున్నట్లు తెలిపారు. బూస్టర్ డోస్ వేసుకోని వారు వెంటనే డీ.ధర్మారం పీహెచ్సీలో వేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కేంద్ర బృందంతో పాటు ధర్మారం వైద్య సిబ్బంది డాక్టర్ సుమిత్ర, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు.