రామచంద్రాపురం, ఆగస్టు3: మూడేండ్ల వయస్సులోనే మూడు రికార్డులు సొంతం చేసుకున్నాడు మబ్బు వర్షిత్ ప్రద్యుమ్న. సంగారెడ్డి జిల్లా బల్దియా పరిధిలోని భారతీనగర్ డివిజన్ ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే డాక్టర్లు అనిల్‌కుమార్, అఖిల దంపతుల కుమారుడు వర్షిత్ ప్రద్యుమ్నకు 3.10 ఏండ్ల వయస్సు. ఆ బాలుడికి అద్భుతమైన గ్రాస్పింగ్ పవర్ ఉంది. గుర్తించడం, పఠించడంలో ఇటీవల చెన్నైలో జరిగిన కలామ్స్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్లో వర్షిత్ కొత్త రికార్డ్ నెలకొల్పాడు. 1.13 నిమిషాల్లో 118 పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ చెప్పాడు. 3 నిమిషాల్లో 115 దేశాల జెండాలు గుర్తుపట్టాడు.
13 నిమిషాల్లో 260 ఇంగ్లిష్ స్పెలింగ్స్ చెప్పి, 9 నిమిషాల్లో పియానో వాయించి, 22 రైమ్స్ చెప్పి, జాతీయ గీతాన్ని ఆలపించాడు. 6 నిమిషాల్లో 195 దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పి కలామ్స్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. వర్షిత్ రెండేండ్ల వయస్సులోనే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, 3.3 ఏండ్ల వయస్సులో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.