రామాయంపేట, జూలై 29: కన్న కొడుకు ఆత్మహత్యకు పాల్పడి ఆ తల్లికి పుత్రశోకం పెట్టాడు. ఇక తనకు దిక్కెవరూ లేరంటూ రెండు రోజుల పాటు ఏడ్చి ఏడ్చి చివరకు తన కొడుకు లేని బతుకు తనకెందుకు అనుకున్న దా తల్లి. అందరూ నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఆ తల్లి గుండె నిండా దుఃఖంలో అర్ధ రాత్రి వేళ పాండు చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన రామాయంపేట పట్టణంలోని కటికె వీధిలో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. రెండు రోజుల ముందు తన కొడుకు ధర్మకార్ శివకుమార్(21) నార్సింగి గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల పాటు దొంగచాటుగా ఇతర ప్రాంతాల్లో తిరిగారు. అప్పటి వరకు ప్రేమికుడితో ఉన్న అమ్మాయి ఉన్నట్టుండి తల్లిగారిళ్లు నార్సింగికి వెళ్లింది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో అమ్మాయిని వారు ఇంట్లోనే బంధించారు. నెలరోజులైనా తన ప్రేమికురాలు రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన శివకుమార్ ఈనెల 27న మల్లె చెరువు గట్టుకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ మాతృమూర్తి వరలక్ష్మి చలించి పోయింది. కొడుకు మీద బెంగ పెట్టుకుని రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా తీవ్ర మనస్తాపం చెంది, ఎక్కి ఎక్కి ఏడ్చింది. కొడుకునే తలుచుకుంటూ తల్లఢిల్లింది. గురువారం రాత్రి కూడా కొడుకునే తలుచుకుంది. కుటుం బ సభ్యులంతా పడుకున్న తర్వాత పాండు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఉద యం చూసేసరికి వరలక్ష్మి ఎక్కడా కనిపించలేదు. దీంతో కుటుంబీకులు దగ్గరలోనే ఉన్న పాండు చెరువులో గజ ఈతగాళ్లతో గాలించారు. రెండు గంటలపాటు శ్రమించిన వారి వలకు మహిళ మృతదేహం చిక్కింది. దీంతో కుటుంబీకులు బోరుమన్నారు. రెండు రోజుల్లోనే ఒకే ఇంట్లో నుంచి తల్లీకొడుకులు మృతిచెందడంతో వీధి మొత్తం శోకసంద్రమైంది. కుటుంబ పెద్ద రోదించిన తీరు కలిచివేసింది. రామాయంపేట పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.