మీ ఇంటికి కరెంటు బిల్లు రాలేదా? స్పాట్ బిల్లింగ్ సిబ్బంది బిల్లు ఇవ్వలేదా? బిల్లు కట్టేందుకు ట్రాన్స్‌కో కార్యాలయాలు, గ్రామాల్లోని జీపీ భవనాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే, వీటికి ట్రాన్స్‌కో చక్కటి ఉపాయం ఆలోచించింది. కరోనా కాలంలో స్పాట్ బిల్లింగ్ సిబ్బంది రాకపోవడంతో ఎవరి ఇంటి మీటరు రీడింగ్ వారే తీసుకునేందుకు విద్యుత్ శాఖ సెల్ఫ్ రీడింగ్ సిస్టం తెచ్చింది. ఇందు కోసం ప్రత్యేక యాప్‌లను రూపొందించింది.
చేర్యాల, జూలై 29 : ఇక కరెంటు బిల్లులు చెల్లించేందుకు ట్రాన్స్‌కో డిపార్ట్మెంట్కు చెందిన ఈఆర్వో కార్యాలయం, గ్రామాల్లో జీపీ భవనాల వద్దకు వచ్చే సిబ్బంది వద్దకు వెళ్లే అవసరం లేదు. మీ ఇంట్లో ఉపయోగించిన కరెంటుకు మీరే బిల్లు తీసుకోవచ్చు. వెంటనే ఆన్లైన్లో దానిని చెల్లించవచ్చు. ఇలాంటి సౌకర్యం ఉందనే విష యం చాలా మంది కరెంటు వినియోగదారులకు తెలియ దు. మీ సెల్‌ఫోన్‌తో మీ ఇంటి విద్యుత్ మీరు రీడింగ్‌ను ఫొటో తీస్తే, ఎన్నియూనిట్లు వినియోగించారో తెలుస్తుంది. నెల పూర్తయితే, బిల్లు వస్తుందని, నెలకోసారి బిల్లు కోసం మీటర్ రీడింగ్ ఫొటో తీసుకోవడమే కాక, ఏ రోజైనా మీరు ఫొటో తీస్తే, అప్పటి వరకు ఆ నెలలో ఎన్ని రోజులకు ఎన్ని యూనిట్ల కరెంటు వాడారు? నెల పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులుంది? అప్పటి వరకు మీ బిల్లు ఎంత రావచ్చు? అనేది ఏరోజైనా తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చర్యలు తీసుకుంటున్నాయి. తొలుత హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో కరోనా లాక్డౌన్ సమయంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.ఇప్పటి వరకు 10లక్షల మంది ఇలా సెల్‌ఫోన్ కెమెరాతో వారి ఇంట్లో కరెంటు మీటరు రీడింగ్‌ను ఫొటో తీసి, బిల్లులు చెల్లిస్తున్నారు. నేటికీ చాలా మందికి దీనిపై పూర్తిగా అవగాహన లేదు.
యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి
స్మార్ట్‌ఫోన్‌లో ‘గూగుల్ ప్లే స్టోర్’లోకి వెళ్లి, మొదట మీరు ఏ డిస్కం పరిధిలో ఉంటే దాని యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణకు ‘టీఎస్ఎన్పీడీసీఎల్’, దక్షిణ తెలంగాణకు ‘టీఎస్ఎస్పీడీసీఎల్’ అనే డిస్కం యాప్‌లున్నాయి. వీటిలో ఏదో ఒక ప్రాంతంలో మీ ఇంటి లేదా దుకాణం, పరిశ్రమ కరెంట్ కనెక్షన్ ఉం టుంది. డిస్కం యాప్ డౌన్లోడ్ అయ్యాక, మళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ‘భారత్ స్మార్ట్ సర్వీసెస్’ అనే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను ఓపెన్ చేసి ‘సెల్ఫ్ బిల్లింగ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో రాష్ట్రం అనే చోట తెలంగాణ, డిస్కం అనే చోట మీ కనెక్షన్ ఉన్న పరిధిని ఎంపిక చేసుకోవాలి. అనంతరం మీ కరెంటు కనెక్షన్ యూఎస్సీ నెంబర్ నమోదు చేయాలి. అక్కడ వినియోగదారుడి వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు మీటర్ రీడింగ్ ఫొటో తీయాలి. అది సరిగ్గా రాకపోతే రీడింగ్ అంకెలను నేరుగా నమోదు చేస్తే, బిల్లు ఆన్లైన్లో కనిపిస్తుంది. బిల్లు డౌన్లోడ్ చేసుకొని, ఆన్లైన్లో బిల్లు సులభంగా చెల్లించవచ్చు.
నెల రోజులైతేనే బిల్లు
వినియోగదారులు తప్పక 30రోజులకు తమ రీడింగ్ తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాగానే వినియోగదారులకు సెల్ఫ్ బిల్లింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసేందుకు డిస్కంలు చర్యలు తీసుకోనున్నాయి. విద్యుత్ బిల్లును సెల్‌ఫోన్‌లోని యాప్ సాయం తో సొంతంగానే తీసుకునే ప్రక్రియ ‘టీఎస్ఎన్పీడీసీఎల్’ పరిధిలో 2020 ఏప్రిల్‌లో మొదలైంది. కరోనా లాక్డౌన్ కాలంలో డిస్కం పరిధిలో రెండు లక్షల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.