చేగుంట, జూలై 29 : వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా షెడ్యూల్కులాల అధికారి(డీఎస్సీడీవో) విజయలక్ష్మి పేర్కొన్నారు. చేగుంట మండలకేంద్రంలోని ఎస్సీ బాలుర వసతిగృహా న్ని శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేసి, హాస్టల్ నిర్వాహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతిగృహంలో అందుతున్న సౌకర్యాలు, భోజన వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పోర్ట్స్, రెగ్యులర్ షూస్ విద్యార్థులకు అందజేశారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఉద యం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను క్రమం తప్పకుండా మెనూ ప్రకారం అంద జేయాలని వార్డెన్‌కు సూచించారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డన్ ఉస్మాన్, విద్యార్థులు తదితరులున్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి : ఎంపీపీ శేరి నారాయణరెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని సర్దన గ్రామంలో జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు విద్యాబోధన, మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు విద్యనందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎంపీపీ వెంట ఎంపీడీవో శ్రీరామ్, ఉపాధ్యాయులు మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.