మెదక్/ సంగారెడ్డి, జూలై 26 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రజలు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నది. పర్యవేక్షణ పేరుతో కేంద్ర బృందాలను జిల్లాలకు పంపించి విస్తృతంగా తనిఖీలు చేయిస్తున్నది. కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడంతో పాటు కొత్త నిబంధనలు తీసుకురావడంతో పనిదినాలు తగ్గి కూలీలు ఉపాధి కోల్పోయే అవకాశముంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టగా, ప్రస్తుతం తాము నిర్దేశించిన 573 పనులను మాత్రమే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒక్కో గ్రామంలో 30 నుంచి 100 పనులు చేస్తుండగా, తాజాగా ఏకకాలంలో కేవలం 20 పనులు మాత్రమే చేయాలని నిర్ణయించింది. సాఫ్ట్వేర్ మార్పు కూడా పెద్ద ఆటంకంలా మారింది. పరిపాలనా అనుమతులు మంజూరు, వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలపై సర్పంచ్‌లు, కూలీలు పెదవి విరుస్తున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్ర సర్కారు కుట్ర పన్నుతున్నది. పల్లె ప్రాంతాల్లోని పేదలకు వరంలా మారిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నది. గ్రామాల్లోని ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్న క్రమంలో వారికి స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నది. ఈ పథకాన్ని ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా నిబంధనలను అనుసరించి తెలంగాణ ప్రభుత్వం నిధులను సద్వినియోగం చేసుకుని వందరోజుల ఉపాధి కల్పిస్తున్నది. రెండేండ్ల నుంచి ఉపాధి పథకం కింద సీసీ రోడ్లు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఇలా అన్ని రకాల పనుల చేపడుతున్నది.
ఉపాధిపై కుట్ర పన్నేందుకే బృందం పర్యటన..
ఉపాధి హామీ పథకంపై కుట్ర పన్నేందుకే బీజేపీ సర్కారు గ్రామాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. మెదక్ జిల్లాలోని 469 గ్రామాల్లో 1.73 లక్షల జాబ్ కార్డులు ఉండగా, జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 3వేల మంది కూలీలు ఉన్నారు. ఇందులో 90వేల జాబ్ కార్డుల ద్వారా 1.80 లక్షల మంది పనులు చేస్తున్నారు. చేసే పనులను బట్టి వేతనం కింద 60 శాతం, మెటీరియల్ కంపోనెంట్ కింద 40 శాతం నిధులు ఖర్చు చేసుకునే వీలుంటుంది. అయితే, కూలీల వేతనాల కింద 60 శాతం గ్రాంట్‌ను ఇచ్చిన కేంద్రం 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ ఇవ్వడంలో మాత్రం కొర్రీలు పెడుతున్నది.
జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం 2013 నుంచి 2020 వరకు మాత్రమే జరిగిన పనులను చూస్తామని చెప్పి గ్రామాలకు వెళ్లిన తర్వాత అన్ని పనులను పరిశీలించారు. కేంద్ర బృందం అడిగిన ప్రతి పనిని అక్కడ ఉన్న ఉపాధి కూలీలతో పాటు అధికారులు చూపించారు. జిల్లావ్యాప్తంగా చేపట్టిన పనుల విషయంలో కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు ఇస్తుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఇక్కట్లు
కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలను ఉపాధి హామీ పథకం అమలుకు గొడ్డలి పెట్టులా మారుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా చేపట్టాల్సిన 573 పనులను నిర్దేశించింది. కేంద్రం సూచించిన 573లోని పనులను మాత్రమే ఈజీఎస్ ద్వారా చేపట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో ఈజీఎస్ ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులు చేపట్టేందుకు అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి ఈజీఎస్ ద్వారా పనులు పూర్తి చేసేది.
ఇందులో భాగంగానే కల్లాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాల పనులు ఈజీఎస్ ద్వారా చేపట్టేది ప్రభుత్వం. ఈజీఎస్ పనులు, కూలీల వేతనాల చెల్లింపులకు ప్రభుత్వం రాగాస్ (RAGAS) సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేంది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం రాగాస్ సాప్ట్‌వేర్‌ను తొలగించి ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరి చేసింది. ఇందులో కేంద్రం నిర్దేశించిన 573 పనులను మాత్రమే ఈజీఎస్ ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ మార్పు, కేంద్ర ప్రభుత్వ తాజాగా నిబంధనల కారణంగా గ్రామాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టే అవకాశం లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా గ్రామాలు అభివృద్ధికి, కూలీలు ఉపాధికి దూరం కానున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 2.77 లక్షల జాబ్‌కార్డులు
సంగారెడ్డి జిల్లాలో 2.77 లక్షల మంది కూలీలకు జాబ్‌కార్డులు ఉన్నాయి. కూలీలకు వేజ్ కంపోనెంట్ ద్వారా 100 రోజులకుపైగా ఉపాధి కల్పిస్తారు. ఒక్కో కూలీ ఈజీఎస్ పనులు చేయడం ద్వారా ప్రతిరోజు రూ.150 నుంచి రూ.257 వేతనతం పొందుతారు. మెటీరియల్ కంపోనెంట్ ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, భవనాల, రహదారుల నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఈ ఏడాది ఈజీఎస్ ద్వారా సంగారెడ్డి జిల్లాలో 18వేల పనులు చేపట్టనున్నారు. ఈ ఏడాది ఈజీఎస్ ద్వారా 18వేల పనులు చేపట్టాల్సి ఉండగా, 15వేల పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా 3వేల పనులు ప్రారంభించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజా తీసుకువచ్చిన గ్రామానికి 20 పనులు నిబంధనల కారణంగా జిల్లాలో ప్రారంభం కాని 3వేల పనులు నిలిచిపోయే అవకాశాలున్నాయి. దీని కారణంగా గ్రామాల్లో ఈజీఎస్ పనుల్లో వేగం తగ్గటంతోపాటు ప్రతిపాదిత పనులు నిలిచిపోతాయని సర్పంచ్‌లు, కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘మన ఊరు-మనబడి’ పనులకు ఇబ్బంది?
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో ఈజీఎస్ నిధుల ద్వారా ప్రహరీ, టాయిలెట్స్, కిచెన్ షెడ్లు నిర్మించుకునే అవకాశమున్నది. సంగారెడ్డి జిల్లాలో 575 పాఠశాలల్లో రూ.53 కోట్ల ఈజీఎస్ నిధులతో 787 పనులు చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకున్నది. కాగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక్కో గ్రామంలో ఎంపిక చేసిన 20 పనులు చేపట్టాలనే నిబంధనలను తీసుకువచ్చిన నేపథ్యంలో ‘మనఊరు-మనబడి’ పనులకు ఆటంకం ఏర్పడే అవకాశాలూ లేకపోలేదు.
మెదక్ జిల్లాలో కేంద్ర బృందం పనుల పరిశీలన..
కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పర్యవేక్షణ బృందం డిప్యూటీ సెక్రటరీ, టీమ్ లీడర్ సంజయ్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు మెదక్ జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జిల్లాలో జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనులను వారికి వివరించారు. మెదక్ మండలం ఖాజీపల్లి, చిట్యాల, బాలానగర్, వెల్దుర్తి మండలంలోని బండపోసాన్‌పల్లి, దామరంచ, ఎం.జలాల్పూర్ గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. ఉపాధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని, ఈ విషయంలో అధికారులు, సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కేంద్ర పర్యవేక్షణ బృందం హెచ్చరించింది.
మెదక్ మండలం బాలానగర్‌లో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో పాటు కేంద్రం సభ్యులు రుచిసిన్హా, మోరేశ్వర్లు ట్రాక్టర్‌పై రెండు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి పరిశీలించారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, అడవిలో కందకాలు ఎంత మేర తీశారు..? ఎంత దూరం నీరు వెళ్తుందనే వివరాలను కొలతల ద్వారా నమోదు చేసుకొన్నారు. చెరువులు పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణం, కమ్యూనిటీ ప్లాంటేషన్, మ్యాజిక్ సోప్ ఫిట్లు, జాబ్ కార్డుల వివరాలతో పాటు గ్రామ పంచాయతీల్లో నిర్వహించే ఏడు రకాల రిజిస్టర్లు, కాలువల శుభ్రత వంటి సుమారు 25 రకాల పనులను పరిశీలించారు.