సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/కొండాపూర్/సంగారెడ్డి/ పుల్కల్,జూలై 26 : సోమవారం రాత్రి నుంచి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నా యి. జలవనరులు మత్తళ్లు దుంకుతున్నాయి. వాగుల్లో వరద ఉరకలెత్తుతున్నది. కొండాపూర్ మండలంలోని పెద్ద చెరువు, తొగర్పల్లి చెరువు మత్తడి దుంకుతున్నది. సంగారెడ్డి జిల్లా కంది మండలం కేంద్రంలోని కంది దేవుని చెరువు, కిసాన్సాగర చెరువులు అలుగులు ప్రమాదస్థాయిలో పారుతున్నాయి. దేవుని చెరువు, పాత చెరువులను తహసీల్దార్ విజయలక్ష్మి, ఆత్మ చైర్మన్ కృష్ణాగౌడ్ సందర్శించి పరిస్థితిని గమనించారు. జిల్లా సరాసరి 58.3 సెం.మీటర్ల వర్షం కురిసింది.
20 మండలాల్లో సాధారణ కంటే అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా ఏడు మండలాల్లో సాధారణకంటే ఎక్కువ వర్షం కురిసింది. జిన్నారం మండలంలో అత్యధికంగా 9.8 సెం. మీటర్ల వర్షం కురవగా, జహీరాబాద్లో అత్యల్పంగా 7 మీ.మీటర్ల వర్షం కురిసింది. అమీన్పూర్, కంది, సంగారెడ్డి, కొండాపూర్ మండలాల్లో 6 నుంచి 5 సెం.మీటర్ల వర్షం కురిసింది. అందోలు, చౌటకూరు, కల్హేర్, పటాన్చెరు మండలాల్లో 4 నుంచి 3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలతో జిల్లాలోని చెరువులు నిండి జలకళ సంతరించుకుంటున్నాయి. జిల్లాలో 80 శాతం చెరువులు పూర్తిగా నిండాయి.
సింగూరుకు తగ్గిన వరద
సింగూరు ప్రాజెక్టులోకి కొన్ని రోజులుగా కొన సాగిన వరద ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. వరద ప్రవా హం తగ్గడంతో ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. సోమవారం సా యంత్రానికి ప్రాజెక్టులో 27.617 టీఎంసీల నీరు నిలువ ఉన్నదని అధికారులు తెలిపారు.
2355 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలో పంటలు దెబ్బతింటున్నాయి. చాలా చోట్ల పంటలు నీట మునిగాయి. వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక నివేదికలను అనుసరించి జిల్లాలో 2355 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1243 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. కంగ్టి, సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పుల్కల్, అందోలు, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్, మునిపల్లి, వట్పల్లి మండలాల్లో 1243 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. అత్యధికంగా సదాశివపేట మండలంలో 245 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది.
కంది, అమీన్పూర్, జిన్నారం, అందోలు మండలాల్లో 154.2 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. కంగ్టి, సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో 196 ఎకరాల్లో కంది పంటకు నష్టం జరిగింది. సదాశివపేట, జహీరాబాద్, ఝరాసంగం, మొగుడంపల్లి, న్యాల్కల్, రాయికోడ్, వట్పల్లి మండలాల్లో 179 ఎకరాల్లో పెసర పంట వర్షాలతో దెబ్బతిన్నది. సంగారెడ్డి, జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి, న్యాల్కల్, మునిపల్లి మండలాల్లో వర్షాలకు 426 ఎకరాల్లో సోయాబీన్ పంటకు నష్టం వాటిల్లింది. కంగ్టి, సదాశివపేట, జహీరాబాద్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల్లో 80 ఎకరాల్లో మినుము పంట దెబ్బతిన్నది. సంగారెడ్డి, కొండాపూర్ మండలాల్లో వర్షాలతో నాలుగు ఎకరాల్లో జొన్న పంట నష్టపోయింది. కంగ్టి, సంగారెడ్డి, కొండాపూర్, జహీరాబాద్, కోహీర్ మండలాల్లో 66 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. వర్షాల కారణంగా మొగుడంపల్లి మండలంలో పది ఎకరాల్లో చెరుకు పంటకు నష్టం వాటిల్లింది.