సంగారెడ్డి అర్బన్, జూలై 26 : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉన్నందున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వర్షాల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, వర్షాలు తగ్గుమఖం పట్టాక ప్రబలే వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడేందుకు వైద్యాధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఎలాంటి కేసులు వచ్చినా ఎదుర్కొని వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. జిల్లాలోని 29 పీహెచ్సీలు, 3 అర్బన్ సెంటర్లు, 246 సబ్ సెంటర్ల వారీగా బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు.
జిల్లా, డివిజన్ స్థాయిలో కూడా అధికారులు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ కావాల్సిన వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యాధికారి నుంచి ఆశవర్కర్ వరకు ఎమర్జెన్సీ మందులతో పాటు నార్మల్ మందులను అందుబాటులో ఉంచారు. గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న గ్రామాలకు తక్షణమే వెళ్లి వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు వెంటనే ఆగ్రామాలకు చేరుకొని వైద్యసేవలు అందించనున్నారు. వర్షాలతో తాగునీరు కలుషితమై డయేరియా, దోమలతో టైఫాయిడ్, డెంగీ కేసులు పెరిగే ప్రమాదం ఉన్నందున మెడిసిన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. విషజ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వర్షాలతో ప్రజలకు ఆనారోగ్య సమస్యలు తలెత్తకుండా జిల్లాలో వైద్యాధికారులు తీసుకుంటున్న చర్యలపై జిల్లా వైద్యాధికారి గాయత్రిదేవి ప్రత్యేక ఇంటర్వ్యూ…
నమస్తే తెలంగాణ : సీజనల్ వ్యాధులపై తీసుకుంటున్న చర్యలు ఏమిటి ?
డీఎంహెచ్వో : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో వాతావరణంలో వచ్చే మార్పుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగుచర్యలు తీసుకుంటున్నాం. పీహెచ్సీల్లో కావాల్సిన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం. వర్షాలు తగ్గుముఖం పడితే వ్యాధు లు ప్రబలే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.
వ్యాధుల బారిన పడకుండాఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ?
వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తి గత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిలో దోమల తెరను వాడటంతో పాటు చెట్లు, పూల కుండీలు, పాత కాలం నాటి రోళ్లు, పాత టైర్లులో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేసవిలే వాడిన కూలర్లలో నీరు లేకుండా చూసుకోవాలి. ఇంటిలోని వాటర్ ట్యాంక్లను వారం రోజులకోసారి క్లీన్ చేయాలి. ఇంటి పరిసర ప్రాంతాల చుట్టూ నీటి గుంతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలి. వర్షంలో తడవటం, చలిగాలిలో తిరగకూడదు. వాంతులు, విరేచనాలు అయితే వెంటనే దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. అప్రమత్తంగా ఉంటే మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరా లు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
అనారోగ్యం చేస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?
వేడి వేడి ఆహారం తీసుకోవాలి. బయటి చిరుతిండ్లు తినకుండా ఇంటి భోజనమే చేయాలి. పౌష్టికాహారం పాలు, పండ్లు, చిరు దాన్యాలు, పప్పుదినిసులు, చేపలు, గుడ్లు ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా పానీపూరి లాంటి ద్రవపదార్థాల జోలికి వెళ్లక పోవడం మంచిది. స్వచ్ఛమైన నీటిని తాగడంతో పాటు ఆహారంలో కల్తీ లేకుండా చూసుకోవాలి. వంట గదిలో ఈగలు, దోమలు లేకుండా చూడాలి.
వ్యాధులపై కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు ఏమిటి ?
సీజనల్ వ్యాధులపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. ప్రతినెలా నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాల్లో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నాం. జూలై రెండో వారంలో గతంలో కంటే వర్షాలు అధికంగా పడడంతో వ్యాధులు సక్రమంచే పరిస్థితి నుంచి ప్రజలను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది.