మెదక్, జూలై 25 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతున్నది. ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకుంటూ రైతులు పండ్ల తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. మామిడి, బొప్పాయి, అరటి, జామ, డ్రాగన్‌ఫ్రూట్స్, అంజీర, ఆవకాడో వంటి తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా 2022-23కు గానూ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. దీంతో పాటు సబ్సిడీపై కూరగాయల నారు, యంత్రాలు, వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది పెద్దఎత్తున కూరగాయలు, పండ్ల తోటల సాగు విస్తీర్ణం పెంచడానికి అవసరం మేరకు సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేయనున్నది. జిల్లా వ్యాప్తంగా ఉద్యానవన పంటలు, తోటల సాగు మరింత విస్తరించనున్నది.
మెదక్ జిల్లాలో 45.50 హెక్టార్లలో పండ్లతోటలు, కూరగాయలు..
జిల్లా వ్యాప్తంగా ఈసారి 45.50 హెక్టార్ల విస్తీర్ణంలో పండ్ల తోటలను పెంచేందుకు సర్కారు ప్రోత్సాహం అందించనున్నది. ఇందులో భాగంగా 8 హెక్టార్లలో మామిడి సాగుకు రూ.79 వేలు కాగా, సబ్సిడీ రూ.9,840, బొప్పాయి 5 హెక్టార్లలో రూ.1.13 లక్షలు కాగా, రూ.22,500 సబ్సిడీ అందజేస్తారు. అరటి తోట 17 హెక్టార్లకు రూ.5.23 లక్షలు కాగా, రూ.30,700 సబ్సిడీ ఇవ్వనున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. జామ 10.50 హెక్టార్లకు రూ.185 లక్షలు కాగా, రూ.17,600 సబ్సిడీ అందజేయనున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఒక హెక్టార్‌కు రూ.96 వేలు కాగా, రూ.96వేల సబ్సిడీ ఇవ్వనున్నారు. అంజీర 3 హెక్టార్లకు రూ.60వేలు కాగా, రూ.19,900 సబ్సిడీ ఇవ్వనున్నది. ఆవకాడో ఒక హెక్టార్‌కు రూ.18 వేలుగా లక్ష్యాన్ని నిర్ణయించగా, రూ.18వేల సబ్సిడీ ఇవ్వనున్నారు. మొత్తంగా జిల్లాలో పండ్ల తోటల అభివృద్ధికి 45.50 హెక్టార్లకు రూ.10.72 లక్షలు టార్గెట్‌గా నిర్ణయించినట్లు ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు.
పండ్ల తోటల సాగుకు రాయితీ..
పండ్ల తోటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం మూడేండ్ల వరకు రాయితీలను అందిస్తున్నది. వర్షాభావ పరిస్థితుల్లో పండ్ల తోటలు ఎండిపోకుండా తడులు ఇవ్వడానికి 50శాతం రాయితీతో నీటి కుంటలు నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ సంవత్సరానికి 7 నీటి కుంటలకు రూ.5.25 లక్షలు కేటాయించారు. నాణ్యమైన దిగుబడి సాధించుట కోసం కూరగాయల నారు అందుబాటులో ఉంది. ఇందుకు గానూ 20 హెక్టార్లకు రూ.4 లక్షలు కేటాయించారు. ఉద్యాన పంటలలో కలుపు నివారించేందుకు, అధిక దిగుబడుల కోసం ప్లాస్టిక్ మల్చింగ్ 50 శాతం రాయితీతో రైతులకు అందుబాటులో ఉంది. ఇందుకు గానూ 10 హెక్టార్లకు రూ.1.60 లక్షలు కేటాయించారు. పండ్ల తోటల పునరుద్ధరణలో భాగంగా 5 హెక్టార్లకు రూ.లక్ష కేటాయించారు. ఉద్యాన పంటలకు యాంత్రీకరణలో భాగంగా బ్రష్ కట్టర్లను 50శాతం రాయితీతో రైతులకు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా 14 బ్రష్ కట్టర్లకు రూ.2.04 లక్షలు కేటాయించారు. ఉద్యాన పంటల్లో ఎరువులు, మందులు ఇవ్వడానికి యాక్టర్ ఆధారిత స్ప్రేయర్లు ఒకటి సబ్సిడీలో అందుబాటులో ఉంది. ఉద్యాన పంటల్లో సమీకృత చీడ, పీడల నిర్వహణలో భాగంగా పండు ఈగను నియంత్రించుటకు లింగాకర్షణ బుట్టలు 30 శాతం సబ్సిడీతో అందుబాటులో ఉన్నాయి. తేనెటీగల పెంపకానికి బీహైవ్, హనీ బీ కాలనీ, ఇతర పరికరాలు 40 శాతం సబ్సిడీతో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ సూక్ష్మ సేద్యం పథకం ద్వారా పండ్ల తోటలకు డ్రిప్(బిందుసేద్యం) సబ్సిడీ ఇవ్వనున్నారు.
మెదక్ జిల్లాలో 45.50 హెక్టార్లకు రూ.10.72 లక్షలు..
మెదక్ జిల్లాలో రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా 2022-23కి గానూ యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. మామిడి, బొప్పాయి, అరటి, జామ, డ్రాగన్‌ఫ్రూట్స్, అంజీర, ఆవకాడో వంటి తోటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పండ్ల తోటలు ఎండిపోకుండా తడులు ఇచ్చేందుకు 50శాతం రాయితీతో నీటి కుంటలు నిర్మాణం చేయనున్నాం. ఈ ఏడాది 7 నీటి కుంటలకు రూ.5.25 లక్షలు కేటాయించాం.
– నర్సయ్య, ఉద్యానవన శాఖ మెదక్ జిల్లా అధికారి