మెదక్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి సీజనల్ వ్యాధుల నియంత్రణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అంశాలపై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా గ్రామాలు, పట్టణాల్లో నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ కేసులు అధికంగా నమోదువుతున్నాయని, ఇప్పటివరకు 1,610 కేసులు వచ్చాయని అన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి డెంగీ కేసుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని గ్రామాలు, ఆదివారం పట్టణాల్లో ఇంటింటికీ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలన్నారు. డెంగీ, మలేరియా కేసులకు ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స చేయడానికి అవసరమైన వసతులు కల్పిస్తున్నామన్నారు. మందు లు, బ్లడ్ ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నాయని, వైద్య సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రచారం చేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రతి వారం రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫాగింగ్ చేపట్టాలని, కిచెన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు.
2.77 కోట్ల మందికి బూస్టర్ డోస్
రాష్ట్ర వ్యాప్తంగా 2.77 కోట్ల మంది ప్రజలకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందించాలని, ఇప్పటి వరకు 20 లక్షల మందికి వేశామని మంత్రి తెలిపారు. 26 ఆగస్టు 2022 నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించి, 12 నుంచి 17 ఏండ్లు గల విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కోసం బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లలో క్యాంపులు ఏర్పాటుచేయాలన్నారు.
పరిసరాల పరిశుభ్రతే ముఖ్యం: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ గ్రామాల్లో మురుగు కాల్వలు, మిషన్ భగీరథ ట్యాంకులు శుభ్రం చేయాలని, పైప్‌లైన్ లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేశామ న్నారు. పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవోలు, ఏఎన్ఎం, ఆశవర్కర్లు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. అదనపు కలెక్టర్లు ప్రతి రోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. విద్యాశాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమన్వయంతో పనిచేసి ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వంద శాతం వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వసతి గృహాలను డీఈవో, సంక్షేమ శాఖ అధికారులు వారానికి ఒకసారి తనిఖీ చేయాలని, వసతి గృహాల్లో భోజనాన్ని నాణ్యతగా అందించాలని తీసుకోవాలని సూచించారు. వసతి గృహాల్లో నిల్వ ఉన్న పాత బియ్యం తొలగించాలని, పాఠశాలలో శానిటేషన్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, దోమలు వ్యాప్తి చెందకుండా యాంటి లార్వా స్ప్రే చేయాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు. బీసీ సంక్షేమ, పౌర రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 2 లక్షల 12వేల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే లా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, ప్రతి గిరిజన పాఠశాలకు ఒక అధికారికి బాధ్యత అప్పగించి తనిఖీలు చేయాలని సూచించారు.
వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైస్ మిల్లుల త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజూ రెండు షిప్టుల్లో బియ్యం మిల్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారులు వివిధ శాఖల్లో ఖాళీల్లో నియమించాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభు త్వం విడుదల చేసిందని సీఎస్ తెలిపారు. అనంతరం మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.