నారాయణఖేడ్/ కంగ్టి, జూలై 22: నారాయణఖేడ్ దశ మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రోడ్లు, తాగేందుకు నీరు లేక, విద్యార్థులు చదువుకునేందుకు మంచి పాఠశాలలు లేక ఇక్కడి ప్రజలు పడిన బాధలు అన్నీఇన్ని కావని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం, ఇంకా వేగవంతంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నారాయణఖేడ్‌లో ఆర్డీవో కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపాలిటీగా మార్చామన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమ కడుపులు నింపుకున్నారే తప్ప, పేదల కష్టాలు తీర్చలేదన్నారు. అప్పుడు ప్రభుత్వ కళాశాలలు, దవాఖానలు వెలవెలబోయి రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కళాశాలలు, దవాఖానల్లో మెరుగైన వసతులు అందుబాటులోకి తెచ్చి ప్రజలను ఆదుకుంటున్నామన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి గొప్పలు చెబుతున్న బీజేపీ నాయకుల మాటలు ఉత్త జూటా మాటలనే విషయం ఇక్కడి ప్రజలకు బాగా తెలుసని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలకు ఎసరు పెడుతుందని, అలాంటి పార్టీ ఇక్కడ అవసరమా అని ప్రశ్నించారు. ఒకప్పుడు గుక్కెడు నీటికోసం అల్లాడిన ఇక్కడి ప్రజలకు త్వరలోనే బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం జలాలను తెచ్చి రెండు పంటలు పండించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గిరిజనులు అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని 54 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాకుండా ఆయా గ్రామాల్లో పంచాయతీ భవనాల కోసం త్వరలో నిధులు మంజూరు చేస్తామన్నారు. గిరిజన బిడ్డలు ఉన్నత విద్యావంతులు కావాలని, నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం, అందులో నాలుగు ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి కార్పొరేట్ సదుపాయాలు కల్పించామన్నారు.
అదేవిధంగా గిరిజన విద్యాలయాలను ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి వరకు పెంచడమే కాకుండా సంగారెడ్డిలో ఎస్టీ రెసిడెన్షియల్ లా కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దసరా పండుగ వరకు 57 ఏండ్ల పైబడిన వారితో పాటు అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. సొంత జాగ ఉన్న వారికి ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పించేందుకు నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. నిరుద్యోగులకు, సీఎం కేసీఆర్ ఓ గొప్ప అవకాశం కల్పిస్తూ జిల్లా యూనిట్‌గా ఉద్యోగాల్లో 95శాతం రిజర్వేషన్ కల్పించామని, ఇది నిరుద్యోగులకు శుభవార్త అన్నారు. నారాయణఖేడ్‌లోని శెట్కార్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సిజేరియన్ల వల్ల జరుగుతున్న అనర్థాలను మహిళలకు వివరించడం ఆసక్తిని రేకెత్తించింది. వర్జ్యాలు, తిథులు, ముహూర్తాలు అంటూ చాలామంది ప్రసవాలను సిజేరియన్ ద్వారా చేయించుకోవడం మంచిది కాదని, ఇది తల్లిబిడ్డలకు శ్రేయస్కరం కాదని, ఈ విషయంపై మహిళలు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
బీజేపీ అవకాశాల కోసం రాజకీయం చేస్తుంది… గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
బీజేపీ అవకాశాల కోసం రాజకీయం చేస్తున్నదని, డబుల్ఇంజన్తో మనకు ప్రయోజనం లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలతోపాటు మండలంలోని దెగుల్‌వాడి నుంచి చందర్తండా వరకు బీటీరోడ్డు, చౌకన్పల్లి నుంచి జీర్గితండా వరకు బీటీరోడ్లను మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డిలు ప్రారంభించారు. దెగుల్‌వాడి నుంచి చందర్తండా వరకు రూ.165 లక్షలతో ఏర్పాటు చేసిన బీటీరోడ్డు ఆమె ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం దెగుల్వాడిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతున్న పథకాలు తాము అందిస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ గ్రామానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, ఇక్కడ ఉన్న పథకాలు అక్కడ ఉన్నాయా అన్ని ప్రశ్నించారు.
అక్కడ పింఛన్ రూ.500 ఉంటే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.2 వేలు అందజేస్తున్నదని అన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచితంగా 24గంటల కరెంట్ సరఫరా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అందుతున్నాయా లేదో కనుక్కోవాలన్నారు. డబుల్ఇంజన్ సర్కారుతో ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. డబుల్ఇంజన్ వస్తే మళ్లీ వెనక్కి పోతామని వివరించారు. ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసే సీఎం కేసీఆర్‌కు మరోమారు పట్టం కట్టాలన్నారు. 75 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు గిరిజన సమస్యలు మాత్రం తీర్చలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 3,140 గిరిజన గూడాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇప్పుడు తండాల్లో వారు సగర్వంగా పాలించుకుంటున్నారని చెప్పారు. జిల్లా 54 తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం కంగ్టిలో గిరిజన గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు దెగుల్‌వాడి పొలిమెర నుంచి మంత్రులు హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్‌లకు భాజాభజంత్రీలతో గ్రామస్తులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ సంగీతావెంకట్రెడ్డి, జడ్పీటీసీ లలిత, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
నారాయణఖేడ్ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించిన మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌లు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హామీ మేరకు రూ.25 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియంను ప్రారంభించారు. కంగ్టి మండలంలో రూ.4.20 కోట్లతో నిర్మించిన గిరిజన గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం, రూ.1.65 కోట్లతో దెగుల్‌వాడి నుంచి చందర్ తండా వరకు నిర్మించిన బీటీ రోడ్డు, రూ.1.75 కోట్లతో చౌకన్పల్లి నుంచి జీర్గి తండా వరకు ఏర్పాటు చేసిన రోడ్డు, రూ.4.37 కోట్లతో రాంతీర్థ్ నుంచి నాగన్‌పల్లి వరకు ఏర్పాటు చేసిన బీటీ రోడ్లను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించారు. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించినందుకు మంత్రి హరీశ్‌రావు వారిని సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, సంగారెడ్డి కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్పర్సన్ రుబినాబేగం నజీబ్, వైస్ చైర్మన్ పరశురాం, ఏఎంసీ చైర్పర్సన్, సువర్ణశెట్కార్, వైస్ చైర్మన్ విజయ్ బుజ్జి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యతోనే భవిష్యత్తుకు వెలుగులు: సంగారెడ్డి కలెక్టర్ శరత్
విద్యతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వెలుగులు నింపుతాయని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. కంగ్టి గిరిజన గురుకుల పాఠశాల ప్రారంభించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని, పేదవిద్యార్థులు చదువుకోవచ్చన్నారు. గురుకుల పాఠశాలల్లో చదివి ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారని, నేను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఈ స్థాయికి వచ్చానని వెల్లడించారు.
రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన
మండల పరిధిలోని కిషన్‌నాయక్‌తండా వద్ద రోడ్డు నిర్మాణం అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈరోడ్డు తండా మీదుగా హెమ్లానాయక్తండా పొట్పల్లి, నాగన్‌పల్లి వరకు తారురోడ్డు వేసేందుకుగానూ పీఎంజీఎస్‌వై కింద రూ.4.37 కోట్ల పనులు చేపట్టనున్నారు. అంతకుముందు మంత్రికి స్థానిక ఎంపీటీసీ లక్ష్మీబాయి, సుర్త్యానాయక్తండా సర్పంచ్ భారతీబాయి తిలకం దిద్ది మంగళహారతితో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు మంత్రిని ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రయాగ మాధవరావు, సర్పంచ్ జగ్గురాం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంజీవరావు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నాయకులు పాల్గొనారు. కాగా, మంత్రి హరీశ్‌రావును మండల పరిధిలోని వంగ్దాల్ శివారులోని వంతెన వద్ద గైరాన్తండావాసులు తమకు హై లెవల్ వంతెన మంజూరు చేసి, తండాకు వెళ్లే రోడ్డు మార్గం అభివృద్ధి చేయాలని మాజీ ఎంపీటీసీ జైపాల్, సర్పంచ్ కోరారు.
విద్యార్థులతో సహపంక్తి భోజనం..
గిరిజన గురుకుల పాఠశాల ప్రారంభం అనంతరం ఆర్థికశాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు, కలెక్టర్ డాక్టర్ శరత్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్థానికంగా ఉన్న విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో భోజనం అందుతుందా అనే విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
70 ఏండ్లలోలేని అభివృద్ధి ఏడేండ్లల్లో చేసి చూపించాం: ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి
గత ప్రభుత్వాలు 70 ఏండ్లలో చేయని అభివృద్ధి మంత్రి హరీశ్‌రావు కృషితో ఏడేండ్లల్లో చేసి చూపించామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన గిరిజనగురుకుల పాఠశాల ప్రారంభోత్సవ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి లేక పనిష్మెంట్ ప్రాంతంగా ముద్రపడిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పనిష్మెంట్ కింద ఇక్కడికి బదిలీ చేసేవారన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని పేర్కొన్నారు. మున్ముందు మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.