మెదక్ అర్బన్, జూలై 22: బాలికలు అన్ని రంగాల్లో తమ సత్తా చూపించాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్లో షీటీం ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రత, ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన అంతర్జాతీయ ఓకోనోవా మార్షల్ ఆర్ట్స్ కరాటే శిక్షకుడు వసంత్ ఆధ్వర్యంలో బాలికలకు ఆత్మరక్షణలో మెళకువలు నేర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించి, తమ సత్తా చాటుకోవాలన్నారు. మహిళలు, బాలికలను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తే ఆత్మైస్థెర్యంతో ఎదిరించాలన్నారు. తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపాలని, ఏ దశలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఆత్మరక్షణ పద్దతులపై వారిలో అవగహన కల్పించాలన్నారు. అత్యవసర సమయాల్లో రక్షణకు అవసరమైన ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. ఆటో, బస్సు, క్యాబ్‌లో ప్రయాణించే ముందు వాటి నంబర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పిల్లలకు చదువు ఎంతో అవసరమో ఆటపాటలు అంతే అవసరమని సూచించారు.
ఆత్మరక్షణకు కరాటే అవసరం
చదువులతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడే కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు బాలికలు అవసరమన్నారు. మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందన్నారు. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్ బాగుంటుందన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, మెదక్ రూరల్ సీఐ విజయ్, ఓకోనోవా మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు, ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.