నమస్తే తెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్, జూలై22: అచ్చేదిన్ అంటూ నిత్యావసర వస్తువులపై కేంద్ర ప్రభు త్వం జీఎస్టీ విధించి పేదలపై భారం పెంచి, సచ్చేదిన్గా మార్చేసింది. మోదీ సర్కారు పేద ప్రజల నోటికాడి ముద్దకు సైతం పన్ను భారం మోపింది. జీఎస్టీ పేరిట పేదల రక్తం పీల్చుతూ కార్పొరేటర్లకు కొమ్ముకాస్తూ విలాసం పంచుతున్నది. పేదోడు తినే ఆహార పదార్థం, వినియోగించే ప్రతి వస్తువుపై మోదీ సర్కారు జీఎస్టీ పంజా విసిరింది. పాలు, ఆహార ఉత్పత్తులపై విపరీతంగా జీఎస్టీ విధించడంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఓ పక్క పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో ఉక్కిరి బిక్కిరవుతున్న పేద, సామాన్య ప్రజలపై మోదీ సర్కారు మరో పక్క జీఎస్టీ పేరిట మరింత భారం మోపింది. చాలీచాలని జీతాలతో ఏం కొనేటట్టు లేం.. ఏం తినేటట్టు లేమంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మోదీ సర్కారుకు ఇక ముడిందని పేదలు శాపనార్థాలు పెడుతున్నారు. పేదల రక్తం తాగుతున్న బీజేపీ సర్కారుకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యా రు. సిద్దిపేట జిల్లా ప్రజలంతా బీజేపీ సర్కారుపై మండిపడుతున్నారు. పెంచిన జీఎస్టీని వెనక్కి తీసుకునేంత వరకూ ఆందోళనలు చేపడుతామని టీఆర్ఎస్, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి.
ఆర్థికంగా చితికి పోతున్నాం
నాది అటెండర్ ఉద్యోగం. కేంద్రం ధరలు పెంచడంతో చిరు ఉద్యోగులం ఇబ్బందు లు పడుతున్నాం. నా జీతం డబ్బులకు సరుకులు కూడా రావడం లేదు. పిల్లల చదువులు, ఇతర ఖర్చులు పెరిపోయి, నెల వచ్చే వరకు చేతిలో డబ్బులు లేకుండా పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు.
– భీమయ్య, ల్యాబ్ అటెండర్, రామాయంపేట
సామాన్యుడు బతుకుడెట్లా?
కేంద్ర సర్కారు గిట్లా నిత్యావసరాలపై ప న్నులు పెంచుకుంటు పోతే సామాన్యుడు బతుకుడెట్లా? పాలు, పెరుగు, పప్పులను కూడా వదిలిపెట్టకుండా పన్నులు పెంచడం దారుణం. పెద్దోళ్లకు ఎడాపెడా దోచిపెడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.
– పుట్టి నర్సింలు, మెదక్ మండలం
జీతాలు సరిపోవడం లేదు
నేను కాంట్రాక్టు లెక్చరర్‌ను. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచడంతో నా జీతం తిండికి కూడా సరిపోవడం లేదు. ఏ వస్తు వు కొనాలన్నా ఇబ్బందిగా ఉంది. ప్రతి వస్తువుకూ జీఎస్టీ పేరిట పన్నులు పెంచడంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నా. కేంద్ర ప్రభుత్వం వెంటనే జీఎస్టీని తొలగించాలి.
– శ్రీదేవి, కాంట్రాక్టు లెక్చరర్ రామాయంపేట
ప్రతి వస్తువు రేటు పెరిగింది..
కేంద్ర ప్రభుత్వం ప్రతి వస్తువుపై జీఎస్టీని పెంచడంతో ధరలు బాగా పెరిగాయి. గ్రైండర్లపై గతం లో 5శాతం జీఎస్టీ ఉంటే ఇప్పు డు 18శాతం చేసింది. ప్రతి వస్తువుపై రూ.500 వరకు పెరిగింది. వ్యాపారం చేయడం కష్టంగా ఉం ది. కస్టమర్లు ఏదైనా కొనాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. పాత ధరకే ఇవ్వాలని అడుగుతుండ్రు. జీఎస్టీతో ఇబ్బందులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గరీబోళ్ల నడ్డివిరిచేలా వ్యవహరిస్తున్నది.
– రవికుమార్, స్టీల్షాప్ యజమాని, ఆర్సీపురం
బీజేపీతో ప్రజలకు కష్టాలే
బీజేపీతో ప్రజలకు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. పెరుగుతున్న ధరలతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. వంట నూనెతో మొదలు వంట గ్యాస్ వరకు ధరలు భారీగా పెరిగాయి. నెల సరుకులు తెచ్చుకోవాలంటే వేల రూపాయ లు అవుతున్నాయి. పేదల బతుకులు భారం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జీతాలు పెరుగుతలేవు కాని ధరలు పెరుగుతున్నయి.
– రమ్యశ్రీ, గృహిణి, ఆర్సీపురం
బతుకు భారంగా మారుతున్నది
కేంద్రం పెంచుతున్న ధరలతో పేదల బతుకు భారంగా మారుతున్నది. వంటగ్యాస్, పాలు, పెరుగు, పన్నీరు, చాక్లెట్లు ఇలా ప్రతి వస్తువుపై జీఎస్టీ విధిస్తూ పోతే సామాన్యులు బతకడం కష్టమే. పెరిగిన ధరలతో వారంరోజులకు సరిపడా సరుకులు కొనలేకపోతున్నం. బీజేపీకి బుద్ధి చెబుతాం.
– శ్రీశైలం, గోవిందరాజ్‌పల్లి, ప్రైవేట్ ఉద్యోగి