కొమురవెల్లి, జూలై 20: రైతన్నలకు సాగు భారమవుతోంది. పెట్రో, డీజిల్ ధరలు రోజురోజుకూ పైపైకి పాకుతుండడంతో ట్రాక్టర్లు, యంత్రాల కిరాయి కూడా బాగా పెరుగుతున్నది. దీంతో రైతులు అవస్థలు పడాల్సి వస్తున్నది. దుక్కులు దున్నేందుకు, ఇతర పనులకు రైతులు ట్రాక్టర్లను వినియోగిస్తుంటారు. అయితే, డీజిల్ ధర పెరడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాక్టర్ యజమానులు కూడా దుక్కులు గంటకు వెయ్యి నుంచి రూ.1400 దాకా తీసుకుంటున్నారు. పొలం దుక్కే దగ్గర నుంచి కోతకోసి నూర్పిడి చేసేంత వరకు అంతా యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం వానకాలం పంట సీజన్లో రైతులు పొలం దున్నేందుకు ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే తరుణంలో డీజిల్ ధరలు పెరిగాయనే నెపంతో ట్రాక్టర్ యజమానులు రైతుల వద్ద నుంచి అధికంగా పైసలు సొమ్ము చేసుకుంటున్నారు.
గతంలో పొలం దున్నేందుకు గంటకు రూ.వెయ్యి దాకా తీసుకునేవాళ్లు. ప్రస్తుతం గంటకు రూ.1400 వరకు తీసుకుంటుండంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉండటంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలలో చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో భూగర్భజలాలు భారీగా పెరిగి బోర్లు నిండుగా పోస్తున్నాయి. దీంతో మెట్ట భూములు సైతం సాగులోకి వస్తున్నాయి. గతంలో కాడెద్దులతో పొలం దున్నే రైతులు యాంత్రీకరణ అందుబాటులో ఉండటంతో యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీరుతో డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో యాంత్రీకరణపై ఆధారపడిన రైతులకు ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే లీటరుకు రూ.10 పైనే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. దీంతో ట్రాక్టర్ యజమానులు కూడా దున్నకాల రేట్లు పెంచే పరిస్థితి నెలకొంది. రేట్లు పెంచకుంటే గిట్టుబాటయ్యే పరిస్థితి లేదని ట్రాక్టర్
యజమానులు వాపోతున్నారు.
ఇంధన ధరలపై నియంత్రణ ఉండాలి
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ఇటీవల డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు కొంత మేరకు తగ్గించినా అది కంటి తుడుపు చర్య మాత్రమే. దీంతో రైతులకు ఎలాంటి లాభం లేదు. ఏటా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్నఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఉండాలి.
– బచ్చల శ్రీశైలం,రైతు, గురువన్నపేట
ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి లేకుంటే..
గతంతో పోల్చుకుంటే ఖర్చు పెరిగింది. సీఎం కేసీఆర్ ఇచ్చే రైతుబంధు సాయంతో నష్టాలు లేకుండా వ్యవసాయం చేస్తున్నాం. లేకుంటే రైతులు పట్నం బాట పట్టే పరిస్థితి వచ్చేది. గా పువ్వు గుర్తోళ్లు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కూలోళ్లను తీసుకొచ్చే ఆటో వాళ్లు కూడా కిరాయి పెంచడంతో ఈసారి ఖర్చు బాగా పెరిగింది.
– బంటు చంద్రం, రైతు, ఐనాపూర్