సిద్దిపేట అర్బన్, జూలై 20 : ప్రభుత్వం చేపట్టిన పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని అన్ని మండల స్థాయి అధికారులతో ఆయన కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవో, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. జిల్లాలో ఆయా గ్రామాలు, మండలాల్లోని వైకుంఠధామాలు, గ్రామపంచాయతీ భవనం, హరితహారం, గ్రామీణ క్రీడా ప్రాంగణం, బృహత్ ప్రకృతి వనం వంటి పనుల పురోగతిపై మండల అధికారులతో చర్చించారు. గ్రామపంచాయతీ భవనం, వైకుంఠధామాల్లో నీటి సరఫరా, విద్యుత్ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్‌లో ఉన్నవి ఎన్ని, ఇంకా ఎంత సమయం పడుతుందని అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీవోలు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు వీలుగా ఉన్న భవనాలకు పైప్‌లైన్ ద్వారా కనెక్షన్ ఇవ్వాలని, సరఫరా లేని చోట బోరు వేయాలన్నారు. విద్యుత్ సౌకర్యం ఉన్న దగ్గర నుంచి కరెంట్ తీసుకోవాలని, దూరంగా ఉంటే స్తంభాలు వేసి లైన్తీసుకోవాలన్నారు. ఎలాంటి సౌలభ్యం అందుబాటులో లేనిచోట ట్రాన్స్ఫార్మర్లు అమర్చాలని ఎంపీడీవోలు, విద్యుత్ ఈఈని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్మకు సంబంధించిన డీడీ పేమెంట్‌ను గ్రామపంచాయతీ నిధుల నుంచి లేదా ఎంపీడీవో నిధులు తీసుకోవాలన్నారు. కొత్త గ్రామపంచాయతీలకు నిధుల కొరత ఉంటే డీపీవో దృష్టికి తీసుకురావాలన్నారు. మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం హరితహారం, గ్రామీణ క్రీడా ప్రాంగణం, బృహత్ ప్రకృతి వనం ఏ దశలో ఉన్నయో చర్చించారు. చిన్న చిన్న మొక్కలు కాకుండా సుమారు 6 అడుగుల పైన ఉన్నవే నాటాలని, నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డు తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంలో ఎంపీడీవోలు వేగంగా పనిచేయాలన్నారు. గ్రామ సర్పంచ్, సెక్రటరీ, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామకంఠంలో రికార్డులు చూసి 15 నుంచి 20 గుంటల భూమి సేకరించాలన్నారు. బృహత్ ప్రకృతి వనానికి సంబంధించి ఇచ్చిన టార్గెట్ ప్రకారం మీ మీ మండలాల్లో ఎక్కడైనా 5 నుంచి 10 ఎకరాల స్థలం సేకరించాలన్నారు. మండలంలో స్థలం దొరకకుంటే తహసీల్దార్‌కు తెలిపి అసైన్డ్ భూమిని సేకరించాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన పనుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని, తప్పకుండా చెప్పిన విధంగా త్వరగా పనులు పూర్తి చేయాలని హెచ్చరించారు. ప్రతి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని, అప్పటిలోపు 50 శాతం పనులు పూర్తి చేయాలన్నారు. కొన్ని మండలాల్లో వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ సరిగ్గా లేదని, మెరుగపర్చేలా తహసీల్దార్లకు సూచనలు చేయాలని ఎన్ఐసీ-ఎస్ఏటీ వారిని కోరారు. ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బృందాలు వస్తున్నాయి, మాస్టర్ ఎంట్రీని తప్పకుండా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు, డీపీవో దేవకీదేవి పాల్గొన్నారు.