ఆ గ్రామంలో ఎక్కడా చూసినా నర్సరీలే దర్శనమిస్తా యి. పంట పొలాలన్నీ నర్సరీలు అయ్యాయి. మొక్కల పెంపకం లాభదాయకం కావడంతో రాష్ట్రం మొత్తానికి మొక్కలు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మొక్కలను సరఫరా చేసి నర్సరీలకే పెద్దాపూర్ కేరాఫ్ అడ్రస్‌గా మారిం ది. గ్రామంలో 200కు పైగా కుటుంబాలు మొక్కల పెంపకంపైనే జీవిస్తున్నారు. మరో 300మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రక రకాల పండ్లు, పూల మొక్కలను ఇక్కడ పెంచి అమ్ముతున్నారు.
– సదాశివపేట, జూలై 18
మామిడి మొక్కలు ఫేమస్..
పెద్దాపూర్ నర్సరీల్లో మామిడి మొక్కలు ఫేమస్. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మామిడి మొక్కలు సరఫరా అవుతాయి. ప్రత్యేకించి తోతాపూరి, బంగినపల్లి, కేసరి, అల్ఫోన్సా, మల్లిక్, దసేరి రకాలు ఇక్కడ దొరుకుతాయి. ఇవే కాకుండా జామ, సపోట, నారింజ, దానిమ్మలాంటి పండ్ల మొ క్కలను పెంచుతున్నారు. మొక్కల పెంపకంలో చాలా జాగ్రత్త లు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు నిపుణుల సలహాలు తీసుకుంటారు.
ఇతర రాష్ర్టాలకు మొక్కలు ఎగుమతి
ఇక్కడ నర్సరీల్లో పెరిగిన మొక్కలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. నర్సరీలు లేక ముందు ఇక్కడి రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవించేవారు. 1989లో ఇక్కడ కొంతమంది రైతు లు నర్సరీ నిర్వహణ, మొక్కల పెంపకంపై శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత గ్రామంలోనే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఇది గిట్టుబాటు కావడంతో గ్రామంలోని మిగతా రైతులంతా వారి బాటలోనే మొక్కల పెంప కం చేపట్టారు.
ఒకప్పుడు రెండు ఎకరాల్లో ఉన్న నర్సరీలు ఇప్పుడు ఏకంగా 600ఎకరాలకు విస్తరించాయి. దాదాపు 150 నర్సరీలు ఇక్కడ ఉన్నాయి. జిల్లాలో హరితహారం కార్యక్రమానికి ఈ మొక్కలనే తీసుకుంటున్నారు. గ్రామం లో ప్రతి యేడు జూలై నుంచి మొక్కల పెంప కం ఊపందుకుంటుంది. ఇక్కడి మొక్కలకు నాణ్యతలో చాలా పేరుంది. మొక్కల పెంపకం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే అవి ఆరోగ్యంగా ఉంటాయని నిర్వాహకు లు పేర్కొంటున్నారు.