సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 18: విద్యార్థుల్లో వైజ్ఞానిక నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులోని జిల్లా సైన్స్ మ్యూజి యం వద్ద హైదరాబాద్‌లోని ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్, ఎస్సీఈఆర్టీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, స్పేస్ ఆన్ వీల్స్ ను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఖగోళ శాస్ర్తానికి సంబంధించిన ఉపగ్రహాలు, ఉపగ్రహ వాహక నౌకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖగోళ శాస్త్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్, జిల్లా సైన్స్ మ్యూజియం అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించవచ్చన్నారు. విద్యార్థులకు ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడంతో భావి శాస్త్రవేత్తలు తయారవుతారాని ఆకాంక్షించారు. విద్యార్థుల్లోని నిగూడమైన శక్తిని ఇలాంటి కార్యక్రమాలతో వెలికి తీసే అవకాశం ఏర్పడుతుందన్నారు. వీల్స్ ఆన్ స్పేస్ ఏర్పాటు చేయడంపై ఇస్రో, ఎన్ఆర్ఎస్ఏ సంస్థలను అభినందించారు.
సైన్స్ మ్యూజియం అభివృద్ధికి కృషి
అంతకుముందు సర్ సీవీ రామన్ జిల్లా సైన్స్ మ్యూజియాన్ని కలెక్టర్ శరత్ సందర్శించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయా అంశాలపై జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను తట్టిలేపే విధంగా సైన్స్‌ను రూపొందించారన్నారు. జిల్లా సైన్స్ మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాన్యుల కోసం జిల్లా విద్యా శాఖ అరుదైన అవకాశం కల్పించింది. వివిధ పాఠశాలల విద్యార్థులతో పాటు సామాన్యులు దాదాపు 1000 మంది స్పేస్ ఆన్ వీల్స్‌తో పాటు సైన్స్ మ్యూజియాన్ని సందర్శించారు. విద్యార్థుల సందేహాలను ఇస్రో శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు.
19న మధ్యాహ్నం 12 గంటల వరకు
స్థానిక జిల్లా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్‌కు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ నెల 19న మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు స్పేస్ ఆన్ వీల్స్‌ను అందుబాటులో ఉంచేందుకు ఇస్రో అధికారులు, శాస్త్రవేత్తలు అవకాశం కల్పించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఈవో నాంపల్లి రాజేశ్, జిల్లా సైన్స్ అధికారి విజయ్‌కుమార్, ఎన్ఆర్ఎస్ఏ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇస్రో శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.