రామచంద్రాపురం, జూలై18: యువతులకు గాలం వేసి, మాయమాటలు చెప్పి, వాళ్లను నమ్మించి ఓ ప్రబుద్ధుడు 13 పెండ్లీళ్లు చేసుకున్నాడు. ఒక యువతికి తెలియకుండా మరో యువతితో స్నేహంగా ఉంటూ, వారు నమ్మెలా వ్యవహరిస్తూనే యువతుల తల్లిదండ్రులను ఒప్పించి, కట్నకానుకలు తీసుకుని పెండ్లి చేసుకుని ఉడాయించడం అతని నైజం. ఆర్సీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ యువతిని ప్రేమించి, ఆమె తల్లిదండ్రులను ఒప్పించి, పెండ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత అతడు ఆమెను వేధింపులకు గురిచేయడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని వేటపురి గ్రామానికి చెందిన అడప శివశంకర్‌బాబు (40) నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది ఆగస్టులో ఆర్సీపురానికి చెందిన ఓ యువతి అదే కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగరీత్యా శివశంకర్బాబుతో ఆ యువతికి పరిచయం ఏర్పడింది.
శివశంకర్ తన మాయమాటలతో ఆ పరిచయాన్ని కాస్తా ప్రేమగా మార్చేశాడు. దీంతో ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆ యువతి వారి తల్లిదండ్రులకు తెలపడంతో వాళ్లు కూడా వీరి పెండ్లికి అంగీకరించి, డిసెంబర్లో పెండ్లి చేశారు. వివాహమైన కొద్ది రోజులకే అతను బంగారం, డబ్బులు తీసుకురావాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తాళలేక ఆమె కొన్ని నెలలకే పుట్టింటికి వచ్చేసింది.
రోజులు గడుస్తున్నప్పటికీ ఆతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి, అతని గురించి ఆరా తీసింది. దీంతో ఆమెకు కొన్ని నమ్మలేని నిజాలు తెలిశాయి. అతనికి చాలా మందితో ఇదివరకే వివాహం జరిగిందని తెలుసుకున్న ఆమె ఆర్సీపురం పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 13న ఫిర్యాదు చేసింది. ఆర్సీపురం పోలీస్‌స్టేషన్‌లో శివశంకర్బాబుపై కేసు నమోదైన విషయాన్ని తెలుసుకున్న పలువురు బాధిత మహిళలు, ఆదర్శ ప్రతిభ మహిళా మండలి అధ్యక్షురాలు మాచర్ల ప్రతిభ, సంఘం సభ్యులతో కలిసి సోమవారం పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు.
తమని కూడా మాయమాటలతో నమ్మించి పెండ్లీలు చేసుకుని లక్షల రూపాయలు కట్నం తీసుకొని మోసం చేశాడని బాధితులు వాపోయారు. ఇప్పటి వరకు 12మందిని పెండ్లీ చేసుకుని వారి జీవితాలు నాశనం చేశాడని, ప్రస్తుతం గుంటూరులో 13వ పెండ్లి చేసుకుని ఉంటున్నాడని, తక్షణమే అతన్ని పట్టుకుని అరెస్టు చేయాలని బాధితులు, మహిళా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మహిళా సంఘం సభ్యురాలు, బాధితులు సైబరాబాద్ సీపీ కార్యాలయం ఎదుట శివశంకర్బాబుపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఆందోళన చేశారు.
దర్యాప్తు చేస్తున్నాం: సీఐ సంజయ్‌కుమార్
ప్రేమ పేరుతో మోసం చేసి యువతులను పెండ్లీళ్లు చేసుకున్న శివశంకర్బాబుపై ఈనెల 13న ఫిర్యాదు వచ్చిందని, దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు ఫోన్ చేసినా, అతడి ఫోన్ స్వీచ్ ఆఫ్ వస్తున్నదన్నారు. త్వరలోనే అతన్ని పట్టుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఇదే విషయమై అతనిపై ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని అన్నారు.