గజ్వేల్ రూరల్, జూలై 17: ప్రభుత్వం పేదలకు కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పనులు పూర్తి కాగా, చిన్నపాటి పనులు త్వరగా పూర్తి చేసి అర్హులకు పంపిణీ చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలో అధికారులు సిద్ధమవుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, మర్కూక్, కొండపాక మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు వేగం పెంచారు. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సూచనలతో అధికారులు పంపిణీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసేందుకు పనుల్లో నిమగ్నమయ్యారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే పంపిణీ చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. అందుకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, పంచాయతీ అధికారుల బృందం గ్రామాల్లో వారం రోజులుగా పర్యటించి చిన్నపాటి సమస్యలను గుర్తించారు. త్వరలోనే పూర్తి చేసి సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో అర్హుల జాబితాను పారదర్శకంగా సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల ప్రత్యేక చొరవతో నిర్మించిన ఇండ్లను త్వరలోనే పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
గ్రామాల్లో నిర్మించిన ఇండ్ల వివరాలు..
గజ్వేల్ మండలంలో బూరుగుపల్లిలో 45, దాచారంలో 15, సింగాటంలో 25, పిడిచేడ్లో 19, శేర్‌పల్లిలో 20, బెజుగామలో 20, అక్కారంలో 25, జగదేవ్‌పూర్ మండలంలో తిగుల్‌లో 27, కొండపాక మండలంలో దుద్దెడలో 40, అంకిరెడ్డిపల్లిలో 20, జప్తినాచారంలో 25, ఖమ్మంపల్లిలో 60, కొండపాకలో 90, మర్కూక్ మండలంలోని శివారు వెంకటాపూర్‌లో 45, ములుగు మండలంలోని నాగిరెడ్డిపల్లిలో 25, చిన్న తిమ్మపూర్‌లో 22, అచ్చాయిపల్లిలో 30, శ్రీరాంపూర్‌లో 25, బండమైలారంలో 25, బస్వాపూర్‌లో 23, వర్గల్ మండలాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మర్కూక్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట, జగదేవ్‌పూర్ మం డలం చాట్లపల్లి, గజ్వేల్ మండలం అహ్మదీపూర్, కొడకండ్ల గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశారు.
త్వరలో అర్హులకు ఇండ్లు
గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల సూచనల మేరకు జిల్లా అధికారులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా నిర్మించుకున్న ఇం డ్లను అర్హులైన పేదలకు అందజేస్తాం. సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలకోసం చేస్తున్న కృషి జీవితంలో మరిచిపోలేనిది. గజ్వేల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
–వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్
పారదర్శంగా లబ్ధిదారుల ఎంపిక
ఆయా గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులను పారదర్శంగా ఎంపిక చేస్తాం. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా జాబితాను రూపొందిస్తాం. అర్హులకే ఇం డ్ల పంపిణీలో అవకాశం దక్కుతుంది. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు జాబితాను తయారు చేస్తారు.
-ముత్యంరెడ్డి, ‘గడా’ ప్రత్యేకాధికారి