జిల్లా రైతులకు ఎరువుల బరువు తగ్గుతోంది. గజ్వేల్ పట్టణంలోని రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్‌కు గూడ్స్ రైలు ఎరువులు మోసుకొస్తున్నది. శనివారం మూడోసారి ఎరువులు తీసుకొచ్చింది. జూన్ 27న గజ్వేల్‌లో రేక్ పాయింట్ ప్రారంభం కాగా, నిరంతరం ఎరువులు వస్తున్నాయి. మొదటిసారి 1314 మెట్రిక్ టన్నులు, రెండోసారి 1068.5 మెట్రిక్ టన్నులు, మూడోసారి 1433 మెట్రిక్ టన్నుల ఎరువు వచ్చింది. జిల్లాకు కేటాయించినవి ఇక్కడే ఉంచి, మిగతా ఎరువులను మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలకు తరలిస్తున్నారు.
గజ్వేల్, జూలై 16 : గజ్వేల్ రైల్వే స్టేషన్‌లోని రేక్ పాయింట్‌కు గూడ్స్ రైలు ఎరువులు తీసుకొస్తున్నది. శనివారం గజ్వేల్ రేక్‌పాయింట్‌కు మూడోసారి ఎరువులతో గూడ్స్ రైలు చేరుకుంది. జూన్ 27న గజ్వేల్ పట్టణంలోని రైల్వేస్టేషన్లో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి ప్రారంభించిన నాటి నుంచి మూడుసార్లు రైలుమార్గంలో గజ్వేల్ రేక్‌పాయింట్‌కు ఎరువులు వచ్చాయి. మొదటిసారి 1314 మెట్రిక్ టన్నుల నాగార్జున యూరియా రాగా, జిల్లాకు 1070 మెట్రిక్ టన్నులు కేటాయించారు. మిగతా ఎరువులను మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలకు తరలించారు. రెండోసారి 1068.5 మెట్రిక్ టన్నుల గ్రోమోర్ 20:20 ఎరువులు రాగా, జిల్లాకు 580 మెట్రిక్‌టన్నులు సిద్దిపేట జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చేరవేశారు. మిగతా ఎరువులను ఇతర మూడు జిల్లాలకు తరలించారు. శనివారం 1433 మెట్రిక్ టన్నుల నాగార్జున యూరియా రాగా, 870 మెట్రిక్ టన్నుల యూరియాను గజ్వేల్‌తో పాటు జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ డివిజన్లకు తరలించడంతో పాటు మిగతా యురియాను మూడు జిల్లాలకు లారీల ద్వారా రవాణా చేశారు. దీంతో జిల్లాలో పుష్కలంగా ఎరువులు అందుబాటులోకి వచ్చాయి.
-మాదాసు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్, గజ్వేల్
గజ్వేల్ రేక్ పాయింట్‌తో జిల్లాలో ఎరువుల రంది తీరిపోయిందని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. శనివారం గజ్వేల్ రేక్‌పాయింట్‌కు గూడ్స్‌రైలులో చేరుకున్న ఎరువులను ఆయన వ్యవసాయాధికారి నాగరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాదాసు శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు మార్కెట్లో సమృద్ధిగా అం దుబాటులోకి వచ్చాయన్నారు. రైల్వే రేక్‌పాయింట్ వద్ద కు నాగార్జున యూరియా వచ్చిందని, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల రైతుల కోసం యూరి యా సరఫరా చేశారన్నారు. ప్రత్యేక చొరవతో రేక్ పాయింట్ ఏర్పాటు చేసి జిల్లాలో రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు రైతులంతా రుణపడి ఉంటారన్నారు.