తొగుట, జూలై 16 : తొగుట తహసీల్దార్ కృష్ణమోహన్ లంచంగా తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉప తహసీల్దార్ మహ్మద్ జహీర్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడి ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాయలంలో తుక్కాపూర్‌కు చెందిన పలువురు రైతులకు రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఖుషీగా రూ.500 ఇవ్వాలని తహసీల్దార్ కోరారు. రైతులను తీసుకొచ్చిన ఓ ప్రజాప్రతినిధి తహసీల్దార్ మద్దతుగా తలా రూ.వెయ్యి ఇవ్వాలని చెప్పడంతో వారు తహసీల్దార్‌కు ఇచ్చారు. ఈ తతంగం అంతా సదరు ప్రజాప్రతినిధి సెల్ఫోన్లో రికార్డు చేసి, దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. తహసీల్దార్ ఉదంతంలో ప్రజాప్రతినిధి అవినీతికి ఊతం ఇచ్చేలా వ్యవహరించడం, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం చర్చంశనీయమైంది. కొద్ది రోజు క్రితమే రాయపోల్ తహసీల్దార్ శ్రీవల్లి అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కాగా, నేడు కృష్ణమోహన్‌పై వేటు పడడంతో అవినీతి అధికారుల గుండెల్లో అలజడి మొదలైంది. అవినీతి నిరోధకానికి సీఎం కేసీఆర్ ‘ధరణి పోర్టల్’ను ఏర్పాటు చేయగా, కొంత మంది అధికారులు పక్కదారి పట్టడడంతో వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.