వారం రోజులుగా వాన వీడడం లేదు.. ఎడతెరిపి లేని వర్షంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. జలవనరులు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. కూడవెల్లి వాగుపై ఉన్న అన్ని చెక్‌డ్యాంలు పూర్తిగా నిండాయి. పలు చోట్ల శిథిలావస్థకు చేరిన ఇండ్లు కూలిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి పంట, ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చేర్యాలలో నెలకూలిన 30 ఇండ్లు..
చేర్యాల, జూలై 14: ఎడతెరిపి లేని వానతో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలోని పలు గ్రామాల్లో పెంకుటిండ్లు కూలిపోయాయి. ఆయా గ్రామాల్లో కూలిన ఇండ్లను రెవెన్యూ అధికారులు, సిబ్బంది సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. చేర్యాల మండలంలో 15 గృహాలు, మద్దూరు మండలంలో 4, ధూళిమిట్ట మండలంలో 7, కొమురవెల్లి మండలంలో 4 ఇండ్లు కూలిపోయాయి. చేర్యాల ప్రాంతంలో ఎలాంటి పంట నష్టం లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. చేర్యాల మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమును చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణిశ్రీధర్రెడ్డి ప్రారంభించారు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లను ఆ వార్డు కౌన్సిలర్ చెవిటి లింగం గుర్తించి ఇంట్లో ఉన్నవారిని మరో ప్రాంతానికి తరలించి తన సొంత ఖర్చులతో జేసీబీతో ఇండ్లను కూల్చివేశారు. వేచరేణి గ్రామ ప్రధాన రహదారిపై చెట్లుకూలిపోవడంతో సర్పంచ్ యేనుగుల దుర్గయ్య జేసీబీ తీసుకువచ్చి వాటిని తొలిగించారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో చెట్లు నేలకూలడంతో చైర్పర్సన్ వాటిని తొలిగింపజేశారు.

మత్తళ్లు దుంకుతున్న జలవనరులు
గతంలో ఎన్నడు లేని విధంగా విరామం లేకుండా ఓ మోస్తరుగా వర్షం కురియడంతో చేర్యాల మండలంలోని ఆకునూరు పెద్దవాగులోని చెక్‌డ్యాం, దొమ్మాట గ్రామంలోని చెక్‌డ్యాంలు మత్తడి దూకుతున్నాయి. కొమురవెల్లి మండలంలోని పోసాన్పల్లి గుండ్ల చెరువు మత్తడి పోస్తున్నది. చేర్యాల మండలం దొమ్మాట కృష్ణవేణమ్మ, వీరన్నపేట మీధునమ్మ, పోతిరెడ్డిపల్లి మారెడ్డి చెరువు, కడవేర్గు పెద్ద చెరువు, కమలాయపల్లి పెద్ద చెరువు, కొమురవెల్లి మండలం ఐనాపూర్ పెద్ద చెరువు, మద్దూరు మండలం గాగిళ్లాపూర్ పెద్ద చెరువు, లద్నూరు చెరువు, ధూళిమిట్ట మండలం కూటిగల్ పెద్ద చెరువులోకి కొంత మేరకు వరద నీరు చేరినట్లు పరిసర రైతులు తెలిపారు.
వారం రోజులుగా కురుస్తున్న వానలతో దుబ్బాక నియోజకవర్గంలోని చెరువు, కుంటలకు జలకళ సంతరించుకుంది. ఏకధాటిగా వర్షంతో ఆయా చెరువు, కుంటల్లోకి భారీగా నీరు చేరింది. నియోజకవర్గంలోని మొత్తం 513 చెరువులు, కుంటలున్నాయి. ఇందులో చేగుంట, నార్సింగ్ మండలాల్లో (మెదక్ జిల్లా పరిధిలో) 156 చెరువు, కుంటలున్నాయి. సిద్దిపేట జిల్లా పరిధిలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మొత్తం 357 ఉన్నాయి. ఇందులో వంద ఎకరాలకు పైగా ఆయకట్టు గల చెరువులు 20 పెద్ద చెరువులున్నాయి. ప్రసుత్తం కురిసిన వర్షాలతో పెద్ద చెరువుల్లోకి 60శాతానికి పైగా నీరు చేరిందని నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడించారు. 37 చెక్ డ్యాముల్లో వర్షం నీరు చేరి మత్తళ్లు దుంకుతున్నాయి. ఇక 300 చెరువులు, కుంటల్లోకి నీరు చేరటంతో జలకళ సంతరించుకుంది. ఇందులో 103 కుంటలు వర్షం నీటితో నిండినట్లు అధికారులు తెలిపారు.
పొంగిపొర్లుతున్న కూడవెల్లి వాగు
దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన వాగు కూడవెల్లిలోకి నీటి ప్రవాహం జోరుగా కొనసాగుతున్నది. వాగులో నిర్మించిన 37 చెక్‌డ్యాంలు నిండిపోవడంతో పాటు ప్రవాహ ఉధృతి భారీగా పెరిగింది. కూడవెల్లి వాగులో నుంచి నీరు.. ఎగువ మానేరులోకి ప్రవహిస్తున్నది. గజ్వేల్ నుంచి ప్రారంభమైన కూడవెల్లి వాగు దుబ్బాక నియోజకవర్గం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరులోకి చేరుతోంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కూడవెల్లి వాగులోని చెక్‌డ్యాంలు పూర్తిగా నిండాయి.
కూలిన ఇండ్లను పరిశీలించిన గడా ప్రత్యేకాధికారి
గజ్వేల్, జూలై 14: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వర్షాలకు కూలిపోయిన ఇండ్లను గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి గురువారం పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కమిషనర్ విద్యాధర్, వైస్ చైర్మన్ జకీయొద్దీన్తో కలిసి ఆయా వార్డుల్లో తిరుగుతూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 16వ వార్డులో కౌన్సిలర్ భాగ్యలక్ష్మీదుర్గాప్రసాద్, 5వ వార్డులో శీర్ల శ్యామలమల్లేశంతో వారి వార్డుల్లో కూలిన ఇండ్ల సమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలను వినియోగించుకోవాలన్నారు. వారి వెంట ఏఈ శ్రీధర్‌రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ కూడా ఉన్నారు.
జిల్లాలో 35.5 మి.మీ వర్షపాతం
సిద్దిపేట అర్బన్, జూలై 14: జిల్లా వ్యాప్తంగా గురువారం 35.5 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నారాయణరావుపేట మండలంలో 52.3 మి.మీ., అత్యల్పంగా వర్గల్ మండలంలో 19.5 మి.మీల వర్షపాతం నమోదైంది. దుబ్బాక మండలంలో 41.2 మి.మీ., తొగుటలో 44.6, సిద్దిపేట రూరల్‌లో 44, సిద్దిపేట అర్బన్‌లో 35.9, చిన్నకోడూరులో 35.5, నంగునూరులో 28.5, మిరుదొడ్డిలో 39.7, దౌల్తాబాద్‌లో 43, రాయపోల్‌లో 26.3, ములుగులో 20.9, మర్కూక్‌లో 26.3, జగదేవ్‌పూర్‌లో 28, గజ్వేల్‌లో 31.8, కొండపాకలో 45.3, బెజ్జంకిలో 51.6, చేర్యాలలో 23.9, కోహెడలో 39.1, కొమురవెల్లిలో 51.8, హుస్నాబాద్‌లో 34.5, అక్కన్నపేట్‌లో 28.7, మద్దూరులో 31, ధూళిమిట్ట 29.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం వర్షపాతం 852.9 మి.మీలు కాగా, సరాసరి 35.5మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.