మెదక్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితుల ను సమీక్షిస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపడుతున్నామని, వర్షాలతో నష్టపోయిన వారికి అండగా ఉంటామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లాలో ఆయన పర్యటించారు. మెదక్ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం హవేళీఘనపూర్ మండలం దూప్‌సింగ్ తండా వద్ద వర్షానికి కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. ఆ తర్వాత మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లతో పాటు ఇండ్లు దెబ్బతిన్నాయని, కొంత నష్టం జరిగిందన్నారు. హవేళీఘనపూర్ మండలం దూప్‌సింగ్ తండా వద్ద బ్రిడ్జి కొట్టుకుపోవడంతో తండాకు రాకపోకలకు అంతరాయం జరుగుతున్నదని స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తన దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. దూప్‌సింగ్ తండాలో శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నర్సాపూర్‌లో కోర్టు భవనం కూలిపోవడంతో కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నదన్నారు. కోర్టును తాత్కాలికంగా సీడీపీవో భవనంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరీశ్‌ను ఆదేశించామన్నారు. నర్సాపూర్‌లో కోర్టు భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
మెదక్ రైల్వేలైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.50 కోట్లు
గడిచిన ఆరు నెలల్లో మెదక్ రైల్వేలైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైల్వేలైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, నెలరోజుల్లో ఎరువుల కోసం మెదక్‌లో ర్యాక్ పాయింట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ర్యాక్ పాయింట్ ఏర్పాటుతో జిల్లా ప్రజలకు ఎరువుల కొరత తీరనుందని, ప్రతిరోజూ సనత్‌నగర్ నుంచి లారీల్లో ఎరువులు తీసుకురావాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మెదక్‌లోనే ర్యాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే శాశ్వతంగా ఇబ్బందులు తొలిగిపోతాయని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.6 కోట్లు..
మెదక్ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పూర్తయిన ఇండ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ రమేశ్‌ను ఆదేశించామన్నారు. జిల్లాలో చాలాచోట్ల డబుల్ బెడ్రూం ఇండ్ల కు విద్యుత్, మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామ ని ఆయన భరోసా ఇచ్చా రు. మెదక్ పట్టణంలోని పిల్లికోటల్ వద్ద నిర్మిస్తున్న 900 ఇండ్లు, తూప్రాన్, నర్సాపూర్, చేగుంట, రామాయంపేటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, సెప్టిక్‌ట్యాంక్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఆగస్టు 7న ప్రారంభోత్సవాలకు ఇండ్లను సిద్ధం చేయాని అధికారులను ఆదేశించారు. మెదక్ పట్టణంలో 900 ఇండ్లకు 700ఇండ్లను ఆగస్టు 7న ప్రారంభోత్సవాలు చేస్తామని, మరో 200 ఇండ్లు నెల తర్వాత ప్రారంభిస్తామని చెప్పారు. రామాయంపేటలో 300 ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కూడా ఆగస్టు 7న ప్రారంభిస్తామన్నారు. మెదక్ నియోజకవర్గంలో 1000 ఇండ్లను ప్రారంభిస్తామని తెలిపారు. తూప్రాన్‌లో 417 ఇండ్లు పూర్తయ్యాయని, ఆగస్టు రెండో వారంలో గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. వెల్దుర్తిలో 191 ఇండ్లు, చేగుంట, నర్సాపూర్ పట్టణంలో వచ్చే రెండు నెలల్లో ప్రారంభించాలన్నారు.
పాక్షికంగా కూలిపోయిన 370 ఇండ్లు
మెదక్ జిల్లాలో 370 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఒక్కొక్కరికి రూ.3200 చొప్పున పరిహారం అం దించాలని కలెక్టర్ హరీశ్‌ను ఆదేశించామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాలో 101 చెరువులు నిండాయని, జిల్లాలోని పోచారం , ఘనపూర్ ప్రాజెక్టు పరిసరాల్లోకి ప్రజలు వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గస్తీ కాస్తున్నట్లు తెలిపారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరీశ్, ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు కలెక్టర్ రమేశ్‌ను ఆదేశించామన్నారు. మెదక్ మున్సిపాలిటీలో పాత ఇండ్లు కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిలో ఉన్న వారిని వెంటనే అక్కడి నుంచి పంపించివేయాలని, బంధువుల ఇంట్లో ఉండేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
సింగూరు ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఘనపూర్ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు రూ.85 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేశామని, వర్షాలు తగ్గిన వెంటనే పనులు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు.