సిద్దిపేట, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమవుతున్నాయి. బుధవారం వరకు 12 ఎకరాల్లోపు రైతులకు పైసలు పడగా, రైతులోకం సంబురంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8,71,194 మంది రైతుల చేతికి రూ.809.21 కోట్లు అందాయి. రైతుబంధు డబ్బులు రావడంతో పెట్టుబడుల కోసం రైతులకు రంది లేకుండా పోయింది. కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టాపాస్ బుక్ వచ్చిన రైతులకు సైతం రైతుబంధును రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. మిగిలిన రైతులకు ఎకరాల వారీగా ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నది. వానలు సైతం కూడా ఆశాజనంగా ఉండడంతో రైతులు ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
రైతుల సెల్ఫోన్లకు టింగ్టింగ్ మంటూ పది పన్నెండు రోజులుగా రైతుబంధు మెస్సేజ్‌లు వస్తున్నాయి. తొలుత ఎకరంలోపు రైతులకు రైతుబంధు డబ్బులు జమకాగా, ఆ తర్వాత వరుసగా ఎకరాల వారీగా డబ్బులు జమవుతున్నాయి. రైతుబంధు అం దిస్తూ రైతులకు రాష్ట్ర ప్రభు త్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఈ వానకాలం అందిస్తున్న రైతుబంధు తొమ్మిదో విడతది. మంగళవారం వరకు 12 ఎకరాల్లోపు రైతులకు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వానకాలం సాగుకు (బుధవారం) వరకు 8,71,194 మంది రైతులకు రూ.809.21 కోట్లను జమచేసింది. దీంతో రైతుల సంబురంగా వానకాలం సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
ఆశాజనకం…
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి.వాగులు, వంకలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు జలకళను సంతరించుకుంటున్నాయి. వానకాలం సాగు పనుల్లో రైతులు బిజీగా మారారు. రైతుబంధు డబ్బులు రావడంతో రైతులకు రంది లేకుండా పోయింది. కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టాపాస్ బుక్ వచ్చిన రైతులకు సైతం రైతుబంధును ప్రభుత్వం జమచేసింది. మే 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.8 వేలు అందించారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10వేలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాలో జమచేస్తున్నారు. ప్రస్తుత వానకాలం పంటతో వరుసగా తొమ్మిది సారి రైతుబంధు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. రైతుబంధు డబ్బులతో అన్నదాతలు ఎరువులు, విత్తనాలు, దున్నకం తదితర వాటికి పెట్టుబడికి అక్కరకు వస్తున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 809.21 కోట్లు జమ..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్న రైతులకు వానకాలం సాగుకు 12ఎకరాల్లోపు రైతులకు వరకు8,71,194 మంది రైతులకు రూ.809. 21 కోట్లను జమచేసింది. నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. సిద్దిపేట జిల్లాలోని 3,00,651 మంది రైతులకు రూ. 291,41, 64, 932, మెదక్ జిల్లాలోని 2,41,690 మంది రైతులకు రూ. 184,46,37,775, సంగారెడ్డి జిల్లాలోని 3,28,853 మంది రైతులకు రూ.333,33,64, 111 నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. మిగిలిన రైతులకు ఎకరాల వారీగా రోజువారీగా ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నది.
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్
వానకాలంలో పంటల సాగు కు సీఎం కేసీఆర్ సరైన సమయంలో రైతుబంధు పథకం ద్వారా మాలాంటి రైతులకు పైసలను బ్యాంకు అకౌంట్లోకి నేరుగా వేసిర్రు. ప్రతి ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా పైసలను వేయడంతో బయట అప్పు తెచ్చుడు తక్కువైంది. ఎకరం వ్యవసాయ భూమి నా పేరిట ఉన్నందున నాకు రూ.5వేలు జమ అయినయి. పంటల సాగుకు ప్రతీసారి పైసలు ఇస్తున్న సీఎం కేసీఆర్ రైతుల పాలిట దైవంగా మారారు.
–బండారి స్వామి, రైతు, నిజాంపేట
సమయానికి డబ్బులు ఇచ్చిన దేవుడు సీఎం కేసీఆర్
అమ్మ అయినా అడక్కుండా అన్నం పెట్టదు. కానీ, సీఎం కేసీఆర్ సార్ మాత్రం రైతులకు దేవునోలే పంట సమయానికి బ్యాంకులో రైతుబంధు డబ్బులు వేసి ఆదుకుంటున్నాడు. పంట సమయానికి పైసలు బ్యాంకులో పడడంతో అప్పుల బాధ తప్పింది. అప్పులు లేకుండా హాయిగా రైతుబంధుతో పంటలు విత్తుకుంటున్నాం. కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
–రెడ్డి సత్తయ్య, రాయిలాపూర్, రామాయంపేట మండలం
అప్పులు కాకుండా పంటలేసుకుంటున్నం
సీఎం కేసీఆర్ సారు చాలా మంచోడు. అప్పులు లేకుండా పంటలు వేసుకుంటున్నం. గప్పట్లో వ్యాపారులు పొద్దంతా కుసుండబెట్టుకుని చివరికి లేదన్నా మరలి పోయేటోళ్లం. మల్ల తెల్లారి వచ్చి కుసుంటే పొద్దికి పంట పెట్టుబడికి అప్పుగా పైసలు ఇస్తుండేది. గిప్పుడు గవన్ని తిప్పలు లేవు. సీఎం కేసీఆర్ సారు రైతుల కష్టాలను గుర్తించి పైసలు బ్యాంకులో వేస్తుం డు. ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు అప్పులేకుండా పంటలు పండించుకుంటున్నాం.
–కుమ్మరి నారాయణ, రైతు, కోనాపూర్, రామాయంపేట మండలం