సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 13 : సాంకేతిక విద్యా, శిక్షణ మండలి నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,443 మంది విద్యార్థులు పాలిసెట్‌కు హాజరు కాగా, 2,113 మంది బాలురు, 1,330 మంది బాలికలు ఉన్నారు. పాలిసెట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 2,438 అర్హత సాధించగా, ఇందులో 1,402 మంది బాలురు, 1,036 మంది బాలికలు ఉన్నారు. ఎంబైపీసీ విభాగంలో మొత్తం 2,450 మంది విద్యార్థులు అర్హత సాధించగా, అందులో 1,400 మంది బాలురు, 1,050 మంది బాలికలు ఉన్నా రు. ఎంపీసీ విభాగంలో 70.81శాతం విద్యార్థులు అర్హత సాధించగా, ఎంబైపీసీ విభాగంలో 71.16 శాతం విద్యార్థులు అర్హత సాధించారు.
పాలిసెట్‌లో సత్తా చాటిన వంశీకృష్ణ
పాలిసెట్ ఫలితాల్లో సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాల విద్యార్థి కె.వంశీకృష్ణ తన ప్రతిభను చాటాడు. అగ్రికల్చర్ విభాగంలో 4వ ర్యాంకు సాధించగా, ఇంజినీరింగ్ విభాగంలో 10వ ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయిలో తన సత్తా చూపించాడు. వంశీకృష్ణ ఎంపీసీలో 120 మార్కులకు 118 మార్కులు సాధించగా, ఎంబైపీసీలో 120 మార్కులకు గాను 116.5 మార్కులు సా ధించి అందరి అభినందనలు పొందాడు. ఉత్తమ ర్యాంకు సాధించిన వంశీ కృష్ణను ఆ పాఠశాల అధినేత సలోమాన్రెడ్డి, ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ అరుణారెడ్డి, అడ్మినిస్ర్టేటివ్ హెడ్ జయబాలరెడ్డి, అకడమిక్ డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి, ఉపాద్యాయ బృందం అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
వర్షిత్‌రెడ్డికి 167 ర్యాంకు
బొల్లారం, జూలై 13 : రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిర్వహించిన పాలిటెక్నిక్ కా మన్ ఎంట్రన్స్ 2022 ఫలితాల్లో బొల్లారం మున్సిపల్‌కు చెందిన ఆదర్శ పాఠశాల విద్యార్థి మాస్టార్ కె.వర్షిత్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 167వ ర్యాంకు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన వర్షిత్‌రెడ్డిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు అభినందించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో వర్షిత్ రెడ్డి 10/10 జీపీఏ గ్రేడ్ సాధించడం విశేషం.