మెదక్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాం తాల్లో జలమయమయ్యాయి. అక్కడ నీరు నిల్వ ఉంది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండే చోట దోమలు, సూక్ష్మ క్రిము లు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వ్యాధులు ముసురుకునే వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి. బుధవారం మెదక్ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంట ర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి..
నమస్తే తెలంగాణ : సీజనల్ వ్యాధులను నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
డీఎంహెచ్‌వో : జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా కీటకజనిత వ్యాధులను అరిట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి సంబంధిత వ్యాధులను నివారించేలా ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాం. గతంతో పోల్చితే మలేరియా, డెంగీ వ్యాధులు బాగా తగ్గుముఖం పట్టాయి. దోమల మందు పిచికారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీరాజ్, రక్షిత నీటి సరఫరాల శాఖ, ఐసీడీఎస్‌తోపాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో సంయుక్తంగా పనిచేస్తున్నాం.
నమస్తే : జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో మం దులు అందుబాటులో ఉన్నాయా..?
డీఎంహెచ్‌వో : జిల్లాలో 19 పీహెచ్‌సీలు, మెదక్‌లో అర్బన్ పీహెచ్‌సీతో పాటు జిల్లా కేంద్ర దవాఖాన, రెండు సీహెచ్‌సీ సెంటర్లు, నర్సాపూర్‌లో ఏరియా దవాఖాన ఉన్నాయి. వానకాలంలో వచ్చే వ్యాధులకు సంబంధించిన మందులన్నీ పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచాం. వైద్యులతో పాటు నర్సులు, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు.
నమస్తే : వర్షాకాలంలో ఏయే వ్యాధులు ప్రబలుతాయి. వాటి నివారణ చర్యలు ఏమిటీ..?
డీఎంహెచ్‌వో: వానకాలంలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, టైఫాయిడ్, కామెర్ల వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సీజనల్ వ్యాధులకు సంబంధించి కేసులు నమో దు కాలేదు. ముఖ్యంగా దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు, ఈగలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. వర్షపు నీటి గుంతలు, మురుగు కాల్వలు, తడిసిన చెత్త కుప్పలు, ఇతర నీటిగుంతల్లో నీరు నిల్వ ఉం డకుండా చూసుకోవాలి. సాధారణ జ్వరం, జలు బు సమస్యలు ఈ సీజన్లో వస్తాయి. గాలి, నీటి ద్వారా మానవ శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. వైరస్ రకాన్ని బట్టి జ్వరం ఉంటుంది. కొంత మందికి దగ్గు, కీళ్లనొప్పులు ఉంటాయి. వైరస్ జ్వరం 3 నుంచి 7 రోజుల వరకు ఉం టుంది. వానకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇది సాల్మొనెల్లా టైఫి బాక్జీరియాతో వస్తుంది. మురుగునీరు తాగడం, కలుషిత ఆహారం తీసుకోవడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జ్వరం తగ్గి మళ్లీ మళ్లీ వస్తుంది. మలేరియా ఆడ అనాఫిలిస్ దోమకాటుతో వ్యాప్తి చెందుతుంది. దోమకాటుతో దాని లోపల ఉన్న మలేరియా జెరమ్స్ శరీరంలో లోపలికి వెళ్తాయి. ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి.
నమస్తే : వర్షాకాలంలో వ్యాధులపై ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటీ..?
డీఎంహెచ్‌వో : వానకాలంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో వృథా నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. పెంటకుప్పలు, చెత్తాచెదారం ఇంటికి దూ రంగా వేయాలి. ఇండ్లలోని అన్ని గదుల్లో దోమల మందు చల్లుకోవాలి. ఇంటి పరిసరాల్లో కొబ్బరిబొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. పండ్ల రసం, కొబ్బరి నీరు, సూప్ వంటివి తీసుకోవడం మంచిది.
నమస్తే : పల్లెల్లో వ్యాధుల తీవ్రతపై గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది..?
డీఎంహెచ్‌వో : వానకాలం వచ్చిందంటే గతం లో గ్రామాల్లో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వెంటనే గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించే వాళ్లం. ప్రస్తుతం పరిస్థితులు గతంలో మాదిరిగా లేవు. పల్లెలతో పాటు పట్టణాల్లో వైద్యం ప్రజలకు చేరువైంది. ఇప్పుడు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పిస్తున్నారు. మందు లు అందజేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు ప్రతిరోజూ డ్రైనేజీలను శుభ్రం పరుస్తున్నారు. దీంతో పల్లెల్లో ప్రజల వ్యాధులు తగ్గుముఖం పట్టాయి.