సదాశివపేట, జూలై 13 : వైద్య సేవలు మెరుగుపర్చాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం సదాశివపేట ప్రభు త్వ దవాఖానను తనిఖీ చేశారు. దవాఖానలోని వార్డుల్లో కలియ తిరిగారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ అజయ్‌కుమార్ మాట్లాడుతూ 30 పడకల దవాఖాన ఉన్నా నెలకు 10 మాత్రమే డెలివరీలు అవుతున్నాయని, ప్రసవాల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. ఇన్‌పేషెంట్ల సంఖ్య తగ్గుతుందని, సంఖ్యను పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది తీరు మార్చుకోవాలని, రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. వార్డుల్లో శానిటేషన్ సరిగా లేదని, రోజు శానిటేషన్ చేసి దవాఖాన శుభ్రంగా ఉంచాలన్నారు. దవాఖానకు ప్రహరీ లేదని, నిర్మాణం కోసం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే రివ్యూ మీటింగ్ వరకు దవాఖాన ఫర్మామెన్స్ పెంచాలని స్పష్టం చేశారు. కమిషన్ వెంట దవాఖాన సూరింటెండెంట్ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.
జహీరాబాద్ ఏరియా దవాఖాన తనిఖీ
జహీరాబాద్, జూలై 13 : సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు మైరుగైన వైద్య సేవలనందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఏరియా దవాఖానను పరిశీలించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్యులు రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ సందర్భంగా దవాఖాన నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కమిషనర్ వెంట వైద్యులు, సిబ్బంది ఉన్నారు.