పటాన్చెరు, జూలై 12: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం నగరంలోని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కార్యాలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే, కార్పొరేటర్ మెట్టుకుమార్యాదవ్తో కలిసి వినతి పత్రం అందజేశారు. పటాన్చెరు పట్టణంలో ఇక్రిశాట్ క్రికెట్ టీం గతంలో హైదరాబాద్ అసోసియేషన్ సభ్య త్వం కలిగి ఉండేదని ఎమ్మెల్యే మంత్రికి తెలిపారు. వివిధ పోటీల్లోనూ ఇక్రిశాట్ జట్టు పాల్గొన్నదని వివరించారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్రిశాట్ జట్టు ఏ పోటీలో పాల్గొనడం లేదని, ఆ జట్టు తరపున పట్టణంలోని మైత్రీ క్రికెట్ జట్టుకు అవకాశం ఇవ్వాలని ఇక్రిశాట్ అధికారులను కోరామన్నారు. వారు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మైత్రీ జట్టును ప్రతిపాదిస్తూ అధికారికంగా సమాచారం ఇచ్చారన్నారు. దీనిపై హెచ్‌సీఏ త్వరతిగతిన నిర్ణయం తీసుకునేలా వారికి ఆదేశాలు ఇవ్వాలని మంత్రిని కోరారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే అన్నారు.
క్రీడా ప్రాంగాణాల అభివృద్ధికి అండగా ఉండండి
నియోజకవర్గంలోని వివిధ మండలాల పరిధిలో నిర్మిస్తున్న మినీ స్టేడియాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. పటాన్చెరును స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని అడిగారు. మైత్రీ స్టేడియాన్ని రూ. 7కోట్లతో ఆధునికరించామని మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. ఐదు ఎకరాల విస్తీర్ణంతో ఐదు మినీ స్టేడియాలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మెట్టు కుమార్‌యాదవ్, ఉమ్మడి మెదక్ క్రికె ట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, మైత్రీ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి పాల్గొన్నారు.