సంగారెడ్డి కలెక్టరేట్, జూలై12: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని డివిజన్, మండలస్థాయి అధికారుల ను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వీడియోకాన్ఫరెన్స్ అదనపు కలెక్టర్లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వర్షాల కారణంగా ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలపై డివిజనల్, మండలస్థాయి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
నీటి పారుదల జలాశయాలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. 75శాతం ఎస్ఎఫ్టీ కెపాసిటీ ఉన్న చెరువులు, అలుగు పారుతున్నవి, 100శాతం సర్ప్లస్ ఉన్న చెరువులను మండల స్థాయిలో తహసీల్దార్లు, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ ప్ర తినిధులు, కార్యదర్శులతో కలిసి పరిశీలించాలన్నారు. సమస్యాత్మకమైన వాటిని గుర్తించి వాటి వివరాలు, తీసుకున్న చర్యల నివేదికను ఇవ్వాలన్నారు. రిజర్వాయర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని నీటి పా రుదల శాఖ ఎస్ఈకి సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు, లోతైనా ఏరియాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామ పంచాయతీల్లో క్లోరినేషన్ విధిగా వేయాలి
గ్రామ పంచాయతీల్లో నీటి ట్యాంకుల్లో విధిగా క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ క్రమం తప్పకుండా సక్రమంగా జరగాలని స్పష్టం చేశారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్‌బాల్స్ వేయాలని, రద్దీ ప్రాంతాలన్నింటినీ శానిటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ము ఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి సురక్షిత ప్రాం తాలకు తరలించాలని తెలిపారు. అదే విధంగా చేపల వేట కు వెళ్లే వారిని వెళ్లొద్దని హెచ్చరించాలన్నారు. గొర్రెలు, మేకలను కూడ బయటకు తీసుకెళ్లొద్దని గొర్రె కాపరులకు సూచించాలన్నారు.
విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండాలి
వర్షాలకు చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై పడి పోల్స్ విరగడం, లైన్ తెగటం జరుగుతాయని వాటి వద్ద ఉండకూడదని ప్రజలకు హితవు చేశారు. విద్యుత్‌కు సంబంధించిన నష్టాల నివేదికను ప్రతి రోజు ఇవ్వాలని సంబంధిత ఎస్ఈకి సూచించారు. రోడ్డు కల్వర్టుల పరిస్థితులను పరిశీలించి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. లో లెవెల్ బ్రిడ్జిల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఆశలు, ఏఎన్ఎంల వద్ద అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, 108వాహనాలను ప్రాధాన్యత పరంగా ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని వైద్యాధికారికి సూచించారు.
శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించాలి
శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను డీఈవో, సంబంధిత శాఖల సంక్షేమ శాఖల అధికారులు తనిఖీ చేసి ప్రత్యామ్నాయ భవనాలను చూడాలని ఆదేశించారు. నీటి సరఫరా లైన్లు తనిఖీ చేయాలని, నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని, మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలు ఉంటే గుర్తించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులు అందుబాటులో ఉండాలి
జిల్లా , మండల కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉండి ఏదేని సమస్య వస్తే తగిన చర్యలు తీసుకోవాలని సూ చించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్లోని కంట్రోల్ రూంకు అందజేయాలని తెలిపారు. డివిజన్ స్థాయిలో సమీకృత కంట్రో ల్ రూంను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు రాజర్షీషా, వీరారెడ్డి, డీఆర్డీవో రాధికారమణి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, నీటి పారుదల శాఖ ఎస్ఈ మురళీధర్, ఆయా శాఖల అధికారులు, డివిజనల్, మండలస్థాయి అధికారు లు పాల్గొన్నారు.