సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 12: వర్షాలు కురుస్తున్నందున పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిపై స మీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అన్ని విషయాలపై ప్రజలను చైతన్యం చే యాలని సూచించారు. తడి పొడి చెత్తను వేరు చేసి క్రమం తప్పకుండా సెగ్రిగేషన్ చేయడంతో పాటు కంపోస్ట్ ఎరువు తయారు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇది నిరంతరం గా కొనసాగాలని పేర్కొన్నారు. డంపింగ్‌యార్డులకు బయో ఫెన్సింగ్ చేయాలని, సెగ్రిగేషన్ షెడ్డులు, వైకుంఠధామాలు వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.
క్రీడా ప్రాంగణాలు పూర్తి కావాలి
తెలంగాణ క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడుతున్నందున అన్ని గ్రామ పంచాయతీల్లో వీలైనంత ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యం మేరకు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని, మెప్మా పీడీ, డీఆర్డీవోలకు సూచించారు. రైతు వేదికల్లో రైతులకు శిక్షణ నిర్వహించాలని సూచించారు.
మండలం వారీగా రైతులకు అందించిన పంట రుణాల నివేదికను అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. జిల్లా లో 100 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీఆర్డీవో రాధికా రమణి, డీపీవో సురేశ్‌మోహన్, డీఈవో రాజేశ్, వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు, పశు సంవర్థక శాఖ అధికారి వసంతకుమారి, ఉద్యాన శాఖ అధికారి సునీత, ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులు అఖిలేశ్‌రెడ్డి, ఫిరంగి, పద్మావతి, మెప్మా పీడీ గీత, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ గాయత్రీదేవి, సివిల్ సప్లయిస్ డీఎం సుగుణబాయి పాల్గొన్నారు.
కలెక్టరేట్లో సమీకృత కంట్రోల్ రూం
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 12: ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా సమస్యలు ఎదురైతే ప్రజలు అత్యవసర సహాయానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెల్ఫ్‌లైన్ నంబర్ 08455-276155, 08455-272233లకు ఫోన్ చేసి సమస్యలు తెలుపాలన్నారు. ఈ కంట్రోల్ రూం 24గంటలు పని చేస్తుందన్నారు.
మూడు షిఫ్టుల్లో పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ విభాగం, ఆర్అండ్బీ, పంచాయతీ శాఖ, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, విద్యుత్, ఉద్యాన, నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. వర్షాల ద్వారా అత్యవసర పరిస్థితులు ఎదురైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పై నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని స్పష్టం చేశారు. ఆయా అధికారులు వెంటనే సంబంధిత సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపడతారని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.