మెదక్, జూలై 11 (నమస్తే తెలంగాణ): వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు. మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటల్ సమీపంలో ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఎంసీహెచ్‌లోని వివిధ విభాగాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంసీహెచ్‌లో గర్భిణులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందన్నారు. జిల్లా కేంద్ర దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. సర్కారు దవాఖానల్లో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యతనివ్వాలని డాక్టర్లకు సూచించారు. ఎంసీహెచ్‌లో గర్భిణులకు స్కానింగ్, రక్త పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో రేడియోలజిస్ట్ను నియమిస్తామని, రామాయంపేట దవాఖానలో సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. జిల్లా కేంద్ర దవాఖానలో విద్యుత్, ఇతర మరమ్మతులకు ప్రభుత్వం రూ.98 లక్షలు మంజూరు చేసిందన్నారు. ఏయే పనులు చేపట్టాలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డితో చర్చించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్లు శివదయాల్, చంద్రశేఖర్, మెదక్, హవేళీఘనపూర్ ఎంపీపీలు యమునా జయరాంరెడ్డి, శేరి నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
గైనకాలజిస్టు, ఆర్థోపెడిక్ వైద్యుల ఏర్పాటు
వారం రోజుల్లోనే రామాయంపేట ప్రభుత్వ దవాఖానను పూర్తి స్థాయిలో మెరుగుపరిచి ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందజేస్తామని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేట ప్రభుత్వ దవాఖానను పరిశీలించిన కమిషనర్ విలేకరులతో మాట్లాడారు. వారం రోజుల పాటు మెదక్ జిల్లాలోనే ఉంటానని రామాయంపేట దవాఖానలో ముందుగా గైనకాలజిస్టు, ఆర్థోపెడిక్ వైద్యులను నియమిస్తామన్నారు. సీహెచ్‌సీ నుంచి ప్రభుత్వ దవాఖానను వైద్యవిధాన పరిషత్‌లో ప్రభుత్వం చేర్చిందని, దీంతో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. దవాఖానలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన వైద్యులతో పాటు మందులు కూడా సిద్ధంగా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ దవాఖానలో మరిన్ని సదుపాయాలలు కల్పించి, మెరుగు పరుస్తామని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. దవాఖాన స్థితిగతులను మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి, గజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.