వెల్దుర్తి, జూలై 10: ఈటల రాజేందర్‌కు గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేసే అర్హత లేదని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ అన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానన్న ఈటల మాటలపై ఆదివారం చంద్రాగౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎక్కడో కోళ్ల దందా చేసుకునే నిన్ను రాజకీయాల్లోకి తెచ్చి, ఎమ్మెల్యే, మంత్రిని చేసి రాష్ట్రంలో ప్రముఖ నాయకుడిగా చేసిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా సరితూగని ఈటల ఆయనపై పోటీ చేస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల భార్య జమున పేరిట పరిశ్రమ ఏర్పాటు చేసి, పేదల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిపై తప్పుగా మాట్లాడడం తగదని తెలిపారు.
టీఆర్ఎస్ సర్కారు పేదల పక్షాన నిలబడి ఈటల జమున పేరుతో ఉన్న జమున హ్యాచరీస్ పరిశ్రమ కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేసినట్లు వివరించారు. మాసాయిపేట మండలంలో తనకు ఆస్తులున్నాయని, ఇక్కడి వాడినేనని చెప్పుకునే ఈటల గజ్వేల్ నుంచి కాదని, నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యే మదన్‌రెడ్డిపై పోటే చేసే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. చెప్పేవన్ని తియ్యటి మాటలు అన్న చందంగా ఈటల తీరు ఉన్నదని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, నర్సాపూర్ నుంచి పోటీ చేసి నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.