సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 10: నిరంతర వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సంగారెడ్డి కలెక్టర్ శరత్‌ను ఆదేశించారు. రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేక సురక్షిత చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిండిన చెరువులు, కుంటల వద్ద ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా రసాయన పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం
అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో నిన్నటి వరకు సరాసరి వర్షపాతం 44.9 మీ.మీ నమోదైందని, ఇది జిల్లాలోని పంటలకు అవసరమైన మంచి వర్షపాతమని సీఎస్‌కు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని, అన్ని విధాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖల అధికారులు అన్ని విధాలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు కలెక్టర్ వివరించారు.