చేర్యాల, జూలై 9 : నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం నమస్తే తెలంగాణతో ఎమ్మె ల్యే ఫోన్లో మాట్లాడుతూ గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి తెలుసుకోవాలన్నారు. నియోజకవర్గంలో వరద ఉధృతంగా ప్రవహించే ప్రాంతానికి ప్రజలు వెళ్లొద్దన్నారు. పట్టణాలు, గ్రామాల్లో మట్టితో కట్టిన పురాతన ఇండ్ల గురించి సమాచారం తెలుసుకొని సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారుల సహకారంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. వాగులు, రోడ్లు, బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వరుద ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. సెల్ఫీల కోసం పొంగుతున్న వాగు లు, చెరువుల వద్దకు ప్రజలు వెళ్లొద్దని సూచించారు.
వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా సిద్దిపేట పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు వెళ్లొద్దని, వివిధ వార్డుల్లో మట్టితో కట్టిన శిథిలావస్థలో ఉన్న పురాతన ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, వాగులు, బ్రిడ్జిల వద్ద సెల్ఫీలు దిగొద్దన్నారు. పిల్లలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు అందుబాటులో ప్రజలకు ఉండాలని సూచించారు.
వర్షాలతో జాగ్రత్త..
గజ్వేల్, జూలై 9 : రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని గజ్వేల్ ఏడీఏ బాబూనాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్తి, మొక్కజొన్న, పెసర, కంది మొదలైన పంట చేనుల్లో నీరు నిల్వ ఉంటే నష్టం వాటిల్లే ఆస్కారం ఉందన్నారు. చేనులో నుంచి నీటిని వెంటనే తొలిగించాలని, లేకపోతే మొక్కలు కుల్లిపోయే అవకాశం ఉందన్నారు. వర్షం కురుస్తున్నప్పుడు పంటలకు రసాయన ఎరువులు వాడొద్దన్నారు. వచ్చే రెండు రోజులు వర్షాలు కురుసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పంట సాగులో ఏమైనా సందేహాలుంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
వర్షం నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు..
వర్షం నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా సాఫీగా వెళ్లేలా పనులు చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని చేపల మార్కెట్ వద్ద నిలిచిన వర్షపు నీటిని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. జెట్టింగ్ మిషన్‌తో వర్షంపు నీటిని తొలిగింజేశారు. అనంతరం పట్టణంలో మోడ్రన్ బస్టాండ్ నుంచి పొన్నాల ఎంట్రెన్స్ వరకు కలియ తిరిగారు. వర్షం నీరు ఎక్కడా నిలిచాయో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పట్టణంలో మున్సిపల్ కమిషనర్ పర్యటన
సిద్దిపేట, జూలై 9 : విస్తారంగా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా పట్టణంలో డ్రైనేజీతో ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులు, శానిటరీ ఎస్సైలతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బందితో తీసేయించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నాలాలు పొంగి నీరు రోడ్డుపైకి వస్తుండడంతో ప్రత్యేక పంపులు ఏర్పాటు చేసి నాలాలు శుభ్రం చేయించారు. కమిషనర్ వెంట హరితహారం అధికారి ఐలయ్య, ఏఈలు శ్రీకాంత్, అన్వేశ్, ఇన్స్పెక్టర్ సతీశ్ పాల్గొన్నారు.
సిద్దిపేట మున్సిపల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సిద్దిపేట, జూలై 9 : వర్షాకాలంలో పట్టణ ప్రజలకు సంబంధించిన పారిశుధ్య నిర్వహణ, మురుగు కాల్వలో నీరు నిల్వడం, శిథిలాస్థలో ఉన్న గృహాలు కూలిపోవటం, విద్యుత్ దీపాలకు సంబంధించిన సమస్యలుంటే వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావడానికి మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్ 9505507248కి ఫోన్ చేస్తే వెంటనే సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
చేర్యాలలో కూలిన ఇల్లు..
చేర్యాల, జూలై 9 : రుతుపవనాల కారణంగా రెండు రోజులుగా చేర్యాల పట్టణంలో కురుస్తున్న వర్షానికి శనివారం 2వ వార్డులో పుల్ల రాజుకు చెందిన ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కౌన్సిలర్ లింగం కోరారు.