మెదక్ రూరల్/మెదక్ మున్సిపాలిటీ/కొల్చారం/గుమ్మడిదల, జూలై 9 : తొలి ఏకాదశి తెలుగు వారికి ప్రత్యేకం. ప్రతి నెలలో రెండుసార్లు ఏకాదశి తిథులు వస్తుంటాయి. కానీ, ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదాశికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మహా విష్ణువు అనుగ్రహంతో అకాల మృత్యుహరణంతో పాటు మోక్ష ప్రాప్తికి ఈ రోజు కఠిన నియమాలతో ఉపవాస వ్రతాలు ఆచరించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ తిథితోనే పండుగల ప్రస్థా నం మొదలవుతుందని సంప్రదాయవాదులు భావిస్తారు.
విష్ణును ఆరాధించడమే ఏకాదశి
మోక్ష సాధనకు మనసును మహా విష్ణుపై లగ్నం చేసి ఆరాధించడమే ఏకాదశి ప్రత్యేకం. జగ ద్రక్ష విధుల్లో మహావిష్ణువు అలసిపోయాక, విశ్రాంతి కోసం యోగా నిద్రలోకి వెళ్లే రోజు తొలి ఏకాదశి. అందుకే దీన్ని శయనైక ఏకాదశిగా వ్యవహరిస్తారు. నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలోని ఏకాదశి రోజున మేల్కొంటాడు. దీన్ని ఉత్థాన ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు. మహా విష్ణువు యోగా నిద్రలో ఉన్నంత కాలం ఆయన ప్రసన్నత కోసం నాలుగు నెలల పాటు చాతుర్మాస వ్రతాలు పాటిస్తారు. ఆహార నియమాలు పాటిస్తూ విష్ణు నామస్మరణలో కాలం గడిపితే పుణ్యమే కాకుండా ఆరోగ్య పరిరక్షణ కూడా జరుగుతుందని పూర్వీకులు తెలిపారు. ఏకాదశి రోజు ఉపవాస దీక్షతో అశ్వమేథయాగం నిర్వహించిన ఫలితం ఉం టుందని భక్తులు విశ్వసిస్తారు. ఏకాదశి రోజున నియమనిష్టలతో ఉపవాసం, రాత్రంతా జాగారం చేసి స్వామిని పూజిస్తారు. మరుసటి రోజున ఉదయానే స్నానానంతరం శ్రీహరి పూజ చేస్తారు.
శివయ్యకు ప్రత్యేక పూజలు
తెలుగు సంవత్సరాది 12 మాసాల్లో 24 పర్యాయాలు ఏకాదశి వస్తుంది. ఆషాఢ బహుళ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా జరుపుకొంటాం. భక్తులు తొలి ఏకాదశి రోజంతా ఉపవాసాలుండి భక్తిశ్రద్ధలతో హరిహరాదులను కొలుస్తారు. తొలి ఏకాదశి పాటు ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున శివుడికి పూజలు చేస్తుంటారు. తొలి ఏకాదశి సందర్భం గా భక్తులు ఉపవాస దీక్షలు, జాగరణ చేస్తారు. శివనామస్మరణతో ప్రత్యేక పంచామృత అభిషేకాలు చేస్తారు. సామూహిక లలిత సహస్ర నామ పారాయణం, గీతాపారాయణం, ఓం నమఃశివాయ, హరిహర మహాదేవ నామస్మరణతో భక్తులు స్వామిని స్మరించుకుంటారు.
పిండి వంటలకు ప్రాధాన్యం
ప్రతి తొలి ఏకాదశిని హిందువులు ఆర్భాటంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ రోజు సకినాలు, గారెలు, అరిశలు, చెగోడీల వంటి పిండి వంటలు తయారు చేస్తుంటారు.
తొలి ఏకాదశిన విశేష ఫలితం
తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్ర నామపారాయణం, భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. వైష్ణవాలయాలను దర్శించాలి. మరుసటి రోజు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్ష విరమించాలి. తొలిఏకాదశి రోజు ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.
– కేవీ నర్సింహాచార్యులు, అర్చకుడు, గుమ్మడిదల
తొలిపండుగ ఏకాదశి
ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగా నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. వానకాలంలో వచ్చే మెద టి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే పదకొండు. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటినన్నంటినీ ఒకటిగా చేసి, దేవుడికి నివేదన చేయాలి. – వైద్య శ్రీనివాస్‌శర్మ, పురోహితుడు, మెదక్