మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వానలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు వరినాలు, విత్తనాలు నాటడంలో బిజీగా ఉన్నారు. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని వాగులు, వంకలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లు నిండి అలుగు పారుతున్నాయి. మెదక్ జిల్లాలో 37.3 మిల్లీమీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 26 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో 62.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
– మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి, జూలై 9:మెదక్ జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 1,81 లక్షల ఎకరాల వరకు సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. ఈ ఏడాది వర్షాకాలంలో జిల్లాలో 3,42,200 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా 94వేల ఎకరాల్లో పత్తి పంట, మొక్కజొన్న 19వేలు, కంది 21వేలు, జొన్నలు 4 వేలు, మినుములు 6వేలు, పెసర 8వేల ఎకరాలతోపాటు మరో 9వేల ఎకరాలు ఇతర పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని మెదక్, హవేళీఘనపూర్, కొల్చారం, నర్సాపూర్, వెల్దుర్తి, రామాయంపేట, మాసాయిపేట, తూప్రాన్, చేగుంట, నార్సింగి మండలాలతో పాటు ఘనపూర్ ఆనకట్ట, పోచారం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ వారంలో లక్ష్యం మేర నాట్లు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో 37.3 మి.మీ వర్షపాతం నమోదు..
జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 11 గంటల వరకు 37.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా నిజాంపేట మండలంలో 62.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా చిలిపిచెడ్ మండలంలో 19.8 మి.మీ వర్షం కురిసింది. నార్సింగి మండలంలో 61.3 మి.మీ, మెదక్‌లో 55 మి.మీ, రామాయంపేటలో 52 మి.మీల వర్షం కురిసింది. హవేళీఘనపూర్‌లో 47.8 మి.మీ, పాపన్నపేటలో 35.9 మి.మీ, చిన్నశంకరంపేటలో 45.5 మి.మీ, తూప్రాన్ మండలంలో 43.4 మి.మీ, మాసాయిపేటలో 41.3 మి.మీ, వెల్దుర్తిలో 37.0 మి.మీ, మనోహరాబాద్ మండలంలో 30.8 మి.మీ, నర్సాపూర్ మండలంలో 35.2 మి.మీ, కొల్చారంలో 27.4 మి.మీ, చేగుంట మండలంలో 33 మి.మీ, పెద్దశంకరంపేటలో 34.9 మి.మీ, రేగోడ్‌లో 21.3 మి.మీ, అల్లాదుర్గంలో 23.3 మి.మీ, టేక్మాల్‌లో 23.5 మి.మీ వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి జిల్లాలో 26 మి.మీ వర్షపాతం..
సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు జోరందుకున్నాయి. శనివారం జిల్లాలో సరాసరి 26 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జిన్నారం మండలంలో 58.8 మి.మీ కురవగా, అత్యల్పంగా న్యాల్కల్ మండంలో 16.8 మిల్లీ మీటర్ల వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు వరదలు పారుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని చెరువులు, కుంటల నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ముసురు వానతో వాహనదారులు, పట్టణవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇండ్లకే పరిమితమయ్యారు. సాగు పనులు ప్రారంభమవుతుండగా, వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ, పనుల్లో నిమగ్నమవుతున్నారు.
సింగూరుకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తున్నది. శుక్రవారం సాయంత్రానికి వరద కాస్త తగ్గు ముఖం పట్టినా, ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో అధిక వర్షాలు కురుస్తుండడంతో శనివారం ఉదయం వరద తీవ్రతతో ప్రాజెక్టులో నీరు పెరిగింది. ఘనపూర్ ఆయకట్టుకు జల విద్యుత్ కేంద్రం నుంచి రెండు టర్బయిన్లు ద్వారా 0.2 టీఎంసీల నీటిని విడుదల చేసిన అధికారులు, శుక్రవారం రాత్రి 10:00 గంటలకు నిలిపివేశారు. జల విద్యుత్ కేంద్రంలో ఇప్పటి వరకు 0.299 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయినట్లు ఏడీ పాండయ్య తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 19.492 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 2275 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులు, వర్షాపాతం పుల్కల్లో 0 ఎంఎం, మునిపల్లి 23.8ఎంఎం, వట్పల్లి 18.8 ఎంఎం, మనూర్ 18.3 ఎంఎం మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు తెలిపారు. ప్రాజెక్టులోకి జూన్ నుంచి జూలై 9 శనివారం వరకు 1.197 టీఎంసీల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు.
నిండుకుండలా ‘పోచారం’
హవేళీఘనపూర్, జూలై 9: మెదక్, కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో ఉన్న పోచారం ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరుగడంతో నిండుకుండలా మారింది. కామారెడ్డి జిల్లా నుంచి వాగుల ద్వారా నీరు వస్తుందడంతో నీటి ప్రవాహం పెరుగుతుంది. శనివారం కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లాయి.
మెతుకు సీమ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు
మెదక్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మెదక్ ప్రాంత ప్రజలకు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వేర్వేరుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. రుతుపవనాల ఆగమనం వేళ, వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని దేవతలకు ప్రత్యేక పూజలు, చాతుర్మాస దీక్షలు చేసే భక్తుల ఆకాంక్షలు ఫలించాలని కోరుకుంటూ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.
బక్రీద్ శుభాకాంక్షలు
మెదక్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారనిమెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, అన్నారు. ఆదివారం బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా ముస్లింలను కోరారు.