మెదక్ మున్సిపాలిటీ, జూలై9: ముస్లింలు జరుపుకొనే పండుగల్లో ముఖ్యమైనవి రెండు, ఒకటి ఈదుల్ ఫితర్ (రంజాన్), రెండోది ఈద్-ఉల్ -జుహా (బక్రీద్). బక్రీద్ త్యాగనిరతిని తెలియజేసే పండుగ. ఈ పండుగను త్యాగాల పండుగ అంటారు. బక్రీద్ అంటే ‘బకర్ ఈద్’. బకర్ అంటే జంతువు, ఈద్ అంటే పండుగ. జంతువును బలి ఇచ్చే పండుగ అని అర్థం. ఈ పండుగను ‘ఈద్ ఉల్ ఖుర్భానీ అని కూడా అంటారు. ఖుర్భానీ అంటే దేవుని పేరిట పేదలకు జంతువు మాంసం దానం ఇవ్వడం. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం 12వ నెల ‘జిల్హాజ్జ’లోని పదో తేదీన జరుపుకొంటారు.
పండుగ విశిష్టత
అల్లా ముఖ్య ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం ఇస్లాం విశ్వాసాలను ప్రపంచమంతా ప్రచారం చేస్తూ కాలినడకన తిరుగుతూ ఉండేవాడు. ఇబ్రహీంకు పెళ్లి అయినా చాలా ఏండ్ల వరకు సంతానం కలుగలేదు. ఒక రోజు అల్లాను సంతానాన్ని కలిగించమని కోరుతాడు. అల్లా కరుణతో ఓ కుమారుడు జన్మిస్తాడు. అతనికి ఇస్మాయిల్ అని నామకరణం చేస్తాడు. చాలా సంవత్సరాల తరువాత జన్మించడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఇబ్రహీం తమ పట్ల ఉన్న విశ్వాసాన్ని పరీక్షించదల్చుకున్న అల్లా వరుసగా మూడు రోజులు అతనికి కలలోకి వస్తాడు. తన ముద్దుల కుమారుడు ఇస్మాయిల్‌ను బలివ్వాలని సందేశాన్ని కలలో వినిపిస్తాడు. ఇబ్రహీం సంకల్పాన్ని అతని భార్య, కుమారుడికి తెలియజేస్తాడు. దీంతో అల్లా కోసం తన తండ్రి తీసుకున్న నిర్ణయానికి దైవ భక్తుడైన ఇస్మాయిల్ సంతోషంగా ప్రాణ త్యాగానికి సిద్ధమవుతాడు. దీంతో అల్లా దైవవాణి ద్వారా ఇబ్రహీం ఇది నిన్ను పరీక్షించడానికి మాత్రమే. నా పరీక్షలో నీవు గెలిచావు. నీ కుమారుడికి బదులు ఓ జీవాన్ని (గొర్రె) బలివ్వాలని కోరతాడు. ఆ రోజు నుంచే ఆనవాయితీగా బక్రీద్ పండుగ రోజు ఖుర్భానీగా జంతువును బలి ఇస్తారు.
బక్రీద్ రోజున ముస్లింలు ప్రత్యేకత
బక్రీద్‌కు ముందు రోజు మృతిచెందిన వారి సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలు, వస్తువులు ఉంచుతారు. వారు స్వర్గం నుంచి వచ్చి వాటిని భుజిస్తారని, తమను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. నెమరు వేసే జంతువులను బలి ఇచ్చి మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరో భాగాన్ని బంధువులకు, ఇంకో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు.
మసీదుల్లోనే ప్రార్థనలు
బక్రీద్‌ను నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో ఈద్గాల వద్ద చిత్తడిగా మారింది. దీంతో మసీదులోనే ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు.