అందోల్, జూలై 7: వలస పాలకుల చెరలో బందీగా మారి అందోల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అందోల్ ప్రజలు, స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న క్రాంతికిరణ్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంతో అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఎమ్మెల్యేగా క్రాంతికిరణ్ ఎన్నికైన నాటి నుంచి అన్ని సౌకర్యాలు సమకూరుతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధిలో లోకల్ మార్క్..
స్థానిక సమస్యలు తెలిసిన స్థానిక నాయకుడు ఎమ్మెల్యేగా లేకపోవడమే కారణమనే విషయాన్ని ప్రజలు గుర్తించారు. స్థానిక నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంతో వారు కోరిన అభివృద్ధి కండ్ల ముందు కనబడుతున్నది. అభివృద్ధిలో గ్రామాలు కొత్త కళను సంతరించుకుంటూ నియోజకవర్గం అభివృద్ధిలో లోకల్ మార్కు స్పష్టంగా కనిపిస్తున్నది. పట్ణణంలో ఎంతో చరిత్ర కలిగిన గ్రంథాలయం శిథిలావస్థకు చేరింది.
గతంలో ఇక్కడ నుంచి ఎన్నికై మంత్రులుగా పని చేసిన వ్యక్తులు కనీస మరమ్మతులు కూడా చేయించలేదు. కానీ గ్రంథాలయ విశిష్టత గుర్తించిన ఎమ్మెల్యే కొత్త భవనం నిర్మాణానికి రూ.65 లక్షలు మంజూరు చేయించారు. భవనం నిర్మించి, పాఠకులకు కావాల్సిన వసతులు సమకూర్చి, ఇటీవలే మంత్రి హరీశ్‌రావుతో ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. క్లాక్ టవర్‌కు మరమ్మతులు చేసి దానికి పూర్వ వైభవం తీసుకురానున్నారు. రోడ్డు మధ్యలో డివైడర్లు నిర్మించి పచ్చని చెట్లు నాటించి వాటి మధ్యలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించారు. ఈ లైట్ల వెలుతురులో పట్టణం మెరిసిపోయేలా చేశారు.
రోడ్ల అభివృద్ధికి రూ. 55 కోట్లు
నియోజకవర్గంలోని అందోల్, వట్పల్లి, మునిపల్లి, పుల్కల్, చౌటకూర్, రాయికోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాల రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. దీంతో చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సు రద్దు చేశారు. ప్రైవేట్ వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి. దీంతో ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటిని గుర్తించిన ఎమ్మెల్యే మొదటి ప్రాధాన్యతగా రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టారు. రూ.55 కోట్లతో అందోల్, వట్పల్లి, పుల్కల్, చౌటకూర్, రాయికోడ్, మునిపల్లి, మెదక్ జిల్లాలోన్ని అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాల్లోన్ని గ్రామాల రోడ్లకు మరమ్మతులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ వర్షాకాలంలో టెండర్లు పూర్తిచేసి, ఆ వెంటనే రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
పక్కా ప్రణాళికతో అభివృద్ధి..
నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అభివృద్ధి పనులకు నిధుల అవసరం గుర్తించి, సంబంధిత అధికారులు, మంత్రులను కలుస్తూ నిధులు మంజూరు చేయించుకుంటున్నారు.గతేడాది రూ.12 కోట్లతో అందో ల్- జోగిపేట ప్రధాన రహదారిని నిర్మించారు. ఇప్పుడూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టిసారించారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో సీఎం కేసీఆర్ అందోల్ నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు రూ.55 కోట్లు మంజూరుచేశారు. దీంతో మారుమూల గ్రామాల్లోన్ని రోడ్లు అద్దంలా మెరవనున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ మెరుగుపడి గ్రామాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.
పట్టణాలకు దీటుగా పల్లెల అభివృది ్ధ: ఎమ్మెల్యే క్రాంతికిరణ్
అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా. రానున్న రోజుల్లో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందనున్నాయి. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు కోరుతూ మంత్రి హరీశ్‌రావు కలిసి విన్నవించగా, వెంటనే సీఎంతో మాట్లాడి రూ.55 కోట్లు మం జూరు చేయించారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధిలో వారు ఎంతో సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, స్థానికుడిగా ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నా. రోడ్ల అభివృద్ధి కోసం రూ. 55కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో అన్ని గ్రామాల్లో పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేసి రవాణా వ్యవస్థను మెరుగుపరిస్తే ప్రజల కష్టాలు తొలిగిపోతాయి. ఇటీవలే తాలెల్మ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ప్రారంభించుకున్నాం. త్వరల్లో సంగమేశ్వర-బసవేశ్వర సైతం పూర్తి చేసుకుంటాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పూర్తైతే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది.

రూ. 2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్
అందోల్- జోగిపేటపట్టణంలో రూ.2 కోట్లతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మించి రైతులు, వ్యాపారుల ఇబ్బందులు తొలిగించనున్నారు. మనఊరు- మనబడిలో భాగంగా అందోల్-జోగిపేటతో పాటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. పొలాల్లో పంటలు వేయాలంటే వరుణుడి కరుణ కోసం రైతన్నలు ఎదురు చూసేవారు. పూర్తిగా వర్షాధార పంటలపై ఆధారపడిన రైతులకు ఎత్తిపోతల పథకాలతో భరోసా కల్పించారు. ఎన్నో ఒడిదుడుగులకు ఎదురొడ్డి రూ.36.17 కోట్ల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి మంత్రి హరీశ్‌రావుతో ప్రారంభించి, రైతులకు అంకింతం చేశారు. దీంతో దశాబ్దాల కల నెరవేరింది. త్వరల్లో బసవేశ్వర-సంగమేశ్వర ప్రాజెక్ట్‌లతో సాగు నీరందనుండడంతో రైతులకు సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. నిరుద్యోగ నిర్మూలనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుండడంతో యువతకు స్థానికంగా పనిదొరకనున్నది.