సిద్దిపేట అర్బన్, జూలై 6 : ‘తెలంగాణకు హరితహారం’ ద్వారా జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో తెలంగాణకు హరితహారం, గ్రామీణ క్రీడాప్రాంగణాల ఏర్పాటు, వైకుంఠధామాలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లేబర్ మొబలైజేషన్ తదితర అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈజీఎస్ ఏపీవోలతో మండలాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సందర్ఫంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైనందున ఆలస్యం చేయకుండా వెంటనే హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి వేగవంతం చేయాలన్నారు.
ఈ నెల 20వ తేదీలోగా జిల్లాలోని ప్రతి ఇంటికీ ప్రజాప్రతినిధులతో కలిసి ఆరు మొక్కలు అందించాలని, వాటిలో పండ్లు, పూలు, తులసి మొక్కలు ఉండాలన్నారు. గ్రామాల వారీగా మొక్కల పంపిణీ రిజిస్టర్లో నమోదు చేసి ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. 10 రోజుల్లోగా బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని, వేములఘాట్, పల్లె పహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలో ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ మూడు రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. ఆగస్టు 30వ తేదీలోగా జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. నాటిన అన్ని రకాల మొక్కలకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈడీఎస్ ఏపీవోలు రోజూ ఉదయం 8 గంటలకే గ్రామాలకు వెళ్లి ఉపాధి కూలీలను సమీకరించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పనుల్లో నిమగ్నంకావాలన్నారు. లేబర్ మొబిలైజేషన్ గతేడాది కంటే తక్కువగా ఉన్నదని, దానిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటివరకు క్రీడా ప్రాంగణాలను గుర్తించిన గ్రామాల్లో గురువారం గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవోలు సమావేశం నిర్వహించాలన్నారు. మిగిలి ఉన్న గ్రామాల్లోని వైకుంఠధామాలకు విద్యుత్‌శాఖ అధికారుల సమన్వయంతో 10 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు, జడ్పీ సీఈవో రమేశ్, డీపీవో దేవికాదేవి, అడిషనల్ డీఆర్డీవో సౌజన్య, డివిజనల్ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.