పటాన్చెరు, జూలై6: మండలంలోని మారుమూ ల ప్రాంతంలో ఉన్న ఒక ఫాంహౌజ్లో రహస్యంగా కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం రాత్రి పటాన్చెరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఏపీ రాష్ట్రం దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడు ల్లో రూ. 13లక్షలా 12వేల 140లు స్వాధీనం చేసుకున్నారు. 32 కోళ్లు దాడిలో లభ్యమయ్యా యి. 26 వాహనాలు సీజ్ చేశారు.
డీఎస్పీ భీంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మం డలం చిన్నకంజర్ల గ్రామ శివారులోని ఒక ఫాం హౌస్లో జరుగుతున్న కోళ్లపందేలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడి సమయంలో కొందరు పోలీసుల రాకను గమనించి అక్కడ నుంచి పరారయ్యారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని కూడా అక్కడి నుంచి పరారయ్యారని సమాచారం. దాడి సమయంలో పందెంరాయుళ్లు కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారు. పందెంరాయుళ్ల వద్ద రూ.13లక్షలా 12వేల నగదు లభ్యమైంది. దీంతో పాటు అక్కడ నిలిపి ఉన్న 26 కార్లు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పందెంలోని 32 కోళ్లను కూడా పోలీసులు పట్టుకున్నారు. దాడి సమయంలో పరారయిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఎవరి ఆధ్వర్యంలో ఈ పందాలు జరుగుతున్నాయి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దాడి విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ పందేలు జరుగుతున్న ఫాంహౌస్ వద్దకు వచ్చి పరిశీలించారు. డీఎస్పీ, సీఐల వద్ద వివరాలు సేకరించారు.