జిన్నారం, జూలై 6: ఖాజీ చెరువు, ఆసాని కుంటలను శుద్ధి చేసి సుందరీకరణ పనులు చేపట్టేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి పీసీబీ ఇన్చార్జి మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసానికుంట పూర్తిగా రసాయనాలతో కలుషితమైందని, ఆ నీటిని, ఖాజీపల్లిలోని ఖాజీ చెరువులోని నీటిని పూర్తిగా తొలిగించనున్నట్లు తెలిపారు. ఏడెకరాల ఆసానికుంటను పూర్తిగా శుద్ధి చేసి సుందరీకరణ చేస్తామన్నారు. చెరువు, కుంటలోని మట్టిని మిర్యాలగూడలోని సిమెంట్ ప్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాలుష్య ప్రభావం ఉన్నంత వరకు మట్టి తొలగిస్తామన్నారు. మట్టిని తరలించేందుకు రూ.6 కోట్లు ఖర్చవుతాయని, కాలుష్యం బారిన పడినందున ఆ ఖర్చు పరిశ్రమలే భరించాలని పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. ఆసానికుంటలోకి డ్రైనేజీ నీరు వస్తుండడంతో దానిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీ ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎస్ఆర్ కింద ఖర్చు చేసేందుకు కలెక్టర్ అనుమతి అవసరమని పరిశ్రమల ప్రతినిధులు చెప్పడంతో, తాను కలెక్టర్‌తో మాట్లాడాతానని నీతూకుమారి చెప్పారు. గురువారం సమావేశం ఏర్పాటు చేస్తానని మోడల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్‌రావు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, పీసీబీ ప్రధాన కార్యాలయ అధికారి నరేందర్, ఈఈ రవికుమార్, ఇరిగేషన్ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.