రాష్ట్ర సరిహద్దులోని నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం ఇప్పుడు రూపురేఖలను మార్చుకుంటున్నది. అభివృద్ధిలో తనకు సాటిలేదనేలా ప్రగతి పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేయగా, ఇప్పుడు ఆయా పనులు వడివడిగా సాగుతున్నాయి. తాగునీటి సరఫరా, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, సామూహిక భవనాలు, సమీకృత మార్కెట్ ఇలా.. పట్టణంలో అన్నీ ఏర్పాటవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రగతి పనులు కొనసాగుతుండడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్, జూలై 6: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇటీవల ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన తర్వాత పనులు వేగవంతమయ్యాయి. మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు వార్డుల వారీగా అధికారులు సమీక్షలు నిర్వహించి పనులు చేపడుతున్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. మున్సిపల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో పనులు చేపడుతున్నారు. జహీరాబాద్‌లో 18 కులాలకు చెందిన సామూహిక భవనాల నిర్మాణానికి రూ.7.50 కోట్లు మంజూరు చేశారు. మున్సిపల్లో విలీమైన రంజోల్, పస్తాపూర్, అల్లీపూర్, చిన్న హైదరాబాద్, హోతి(కే) గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిపించేందుకు రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. రూ.15 కోట్లతో 37 వార్డులో బీటీ రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.15 కోట్లతో మురుగు కాల్వలు, వరద నీరు కాల్వల తవ్వకాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.10కోట్లతో సీసీ రోడ్లు వేసేందుకు టెండర్లు వేశారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరాకు రూ.66 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. ఆ నిధులతో పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి వేసేందుకు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు అభివృద్ధి కోసం సమీక్షలు చేసి నిధులు మంజూరుకు కృషి చేస్తున్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట..
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రణాళిక ప్రకారం నిధులు ఖర్చుచేసి సమస్యలు పరిష్కరిస్తాం. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మున్సిపల్ విలీన గ్రామాలతో పాటు పాత పట్టణంలో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. పాత పైపులైన్లు తొలిగించి కొత్తవి ఏర్పాటు చేస్తాం. హరితహారం మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. పట్టణ ప్రగతిలో పార్కులు, నర్సరీలు ఏర్పాటు చేశాం. ప్రతివార్డులో క్రీడా మైదానం నిర్మాణం చేస్తున్నాం.
– సుభాశ్‌రావు, మున్సిపల్ కమిషనర్ జహీరాబాద్
37 వార్డులో పట్టణ ప్రగతి పార్కుల నిర్మాణం..
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 37 వార్డులో పట్టణ ప్రగతి పార్కులు నిర్మాణానికి అధికారులు స్థలాలు గుర్తిస్తున్నారు. పట్టణంలో 21 వార్డుల్లో పట్టణ ప్రగతి పార్కులు నిర్మాణం చేశారు. మిగతా వార్డుల్లో పనులు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
37 వార్డుల్లో క్రీడా మైదానాలు..
జహీరాబాద్ పట్టణంలోని 37 వార్డుల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు సాగిస్తున్నారు. 4 క్రీడా మైదానాలు ఇప్పటికే ప్రారంభించారు. క్రీడా మైదానాల ఏర్పాటుతో యువత క్రీడల్లో దృష్టిసారించే అవకాశమున్నది.
తాండూరు, చిన్న హైదరాబాద్‌లో మొక్కల పెంపకం..
జహీరాబాద్ పట్టణం నుంచి వెళ్తున్న తాండూరు, చిన్నహైదరాబాద్ రోడ్డుకు ఇరువైపులా పచ్చని మొక్కలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హరితహారంలో పట్టణం చుట్టూ ఉన్న అల్గోల్, పస్తాపూర్, రంజోల్ రోడ్ల వెంట మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు కనిపించేలా మొక్కలు పెంపకం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
శరవేగంగా
సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణం..జహీరాబాద్ పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ వరకు పనులు పూర్తిచేసే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. సమీకృత మార్కెట్లో కూరగాయలు, చేపలు, మటన్, చికెన్, చేపలు విక్రయించేందుకు దుకాణా సముదాయాలు నిర్మిస్తున్నారు.
37 నర్సరీలు.. 1.45 లక్షల మొక్కలు పెంపకం
మున్సిపల్ పరిధిలో 37వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 1.45 లక్షల మొక్కలు పెంచుతున్నారు. ప్రతి వార్డులో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ ఖాళీ స్థలాలతో పాటు రోడ్లుకు ఇరువైపులా మొక్కలు పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి పెంచేందుకు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.
వరద నీటి కాల్వల తవ్వకం..
30 ఏండ్లుగా జహీరాబాద్‌లో వరదలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వానలు పడినప్పుడు వరద బయటకు వెళ్లకుండా కాలనీల్లో నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రధాన కాల్వల తవ్వకం పూర్తిచేశారు. 12 కిలోమీటర్ల మేర వరద నీటి కాల్వలు తవ్వారు. ఎక్కడ వరద నిల్వకుండా, నేరుగా వాగులో ప్రవహించేలా కాలువల తవ్వకాలు చేపట్టారు.