కాలం ఎలా మారుతుందో చెప్పలేం.. మనుషుల్లో ప్రేమాభిమానాలు.. అనుబంధాలు తగ్గిపోతున్నాయనే విషయాన్ని గుర్తించాడు ఈ పెద్ద మనిషి.. అందుకనే బతికుండానే భార్య,భర్తల సమాధులు నిర్మించుకొని, కొడుకులు, బిడ్డలకు భారం కాకూడదని భావించారు. మారిన నేటి సమాజానికి ఆనాడే కొత్తదారులు చూపించారు ఆ దంపతులు.. ఆస్తి ఇవ్వలేదని, డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రుల దహన సంస్కారాలు చేసేందుకు ముందుకురాని స్థితిగతులు సమాజంలో వస్తాయనే ముందుగానే ఈ దంపతులు ఊహించారనే చెప్పవచ్చు.
హుస్నాబాద్ టౌన్, జూలై 6: కాలంతో పాటు మనిషి ఆలోచనలు మారుతున్నాయి. నాలుగైదు దశాబ్దాల క్రితం ఉమ్మడి కుటుంబాలు విరివిగా కనిపించేవి. మనుషుల మధ్య ఆప్యాయతలు.. అనుబంధాలు చక్కగా చిగురించేవి. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు.. కానీ, తర్వాత మనిషి ఆలోచనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అనుబంధాలకు బీటలు వారడం మొదలైంది. నాలుగు దశాబ్దాల క్రితం ఓ పెద్ద మని షి ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడు. తను బహుసంతాన వంతుడు అయినప్పటికీ చుట్టాలు.. పక్కాలు చాలా మందే ఉన్నా, తాను చుట్టూరా ఒక గిరి గీసుకున్నాడు. తన బతుకును చావును కూడా చూసుకున్నాడు.. తాను చనిపోతే ఎవరికీ భారం కాకూడదనుకున్నాడు.
బ్రహ్మంగారి బాటలో..
బతికుండానే సమాధిని నిర్మించుకున్న పోతులూరి వీరబ్రహ్మంగారి బాటలోనే ఈ దంపతులు ముందుకెళ్లారు. బతికి ఉన్నప్పుడే సమాధులను నిర్మించుకున్నారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన చెన్నూరి(బాలసంత) వెంకట్రాములకు ఐదుగురు భార్యలు, ఎనిమిదిమంది కొడుకులు, ఆరుగురు ఆడబిడ్డలు. ఊరూరా భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పో షించేవాడు. పెద్ద సంతానం కల్గిన వెంకట్రాములు, తన మరణాంతరం సమాధి చేస్తారో? లేదో?ననే అనుమానంతో ముందస్తుగానే సమాధులను నిర్మించుకున్నాడు. ఇందుకు ఇండ్ల మధ్యనే ఉన్న సొంత స్థలంలోనే సమాధులను నిర్మించుకుంటామంటూ స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని సంప్రదించాడు. అయితే ఇండ్ల మధ్య సమాధులను నిర్మించుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఇందుకు తన కుటుంబసభ్యులతో కలిసి పలుమార్లు సంప్రదించి ఎట్టకేలకు సమాధుల నిర్మాణానికి అనుమతులు సంపాదించాడు.
1982లోనే దంపతుల సమాధుల నిర్మాణం
బతికుండానే సమాధులను నిర్మించుకోవాలనే ఆలోచన వచ్చిందే తడువుగా తాము నివసించే ఇండ్లమధ్యనే సమాధులను నిర్మాణానికి పూనుకున్నాడు. 1982లో తనతో పాటు పోచమ్మ(చివరి భార్య) సమాధి సైతం పక్కనే నిర్మించాడు. పైగా తాము మరణించిన తర్వాత ఇక్కడే సమాధి చే యాలంటూ భార్య, పిల్లలను ఒప్పించాడు. 1992లో వెంకట్రాములు మృతి చెందగా, 2001లో పోచమ్మ మరణించింది. ఈ ఇద్దరినీ వారి సమాధుల్లోనే ఖననం చేశారు. ఇలా బతికుండాగానే సమాధులను నిర్మించుకున్న విషయం ఆనోటా, ఈనోటా తెలిసి హుస్నాబాద్‌తోపాటు చుట్టూ పక్కల ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారడంతోపాటు వీటిని చూసేందుకు సైతం ప్రజలు తరలివచ్చేవారు.
నేటికి ప్రత్యేక పూజలు
బతికుండానే సమాధులు నిర్మించుకున్న తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏటా వారి కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏటా ఆగస్టులో వెంకట్రాములు, నవంబర్‌లో పోచమ్మ సమాధుల వద్ద కుటుంబ సభ్యులందరు పూజలు చేస్తున్నారు. ఒకప్పుడు 14మంది సంతానం కల్గిన వెంకట్రాములు కుటుంబం నేడు వేలాదిమందితో పెద్దబలగంగా మారడమే కాకుండా హుస్నాబాద్ పట్టణంలో పెద్ద కాలనీగా విస్తరించింది.

ఆలోచించాల్సిందే..
మారుతున్న జీవనశైలి.. సుఖంగా బతకాలనే ఆలోచన చిన్నకుటుంబాలకు దారి తీస్తున్నది. అవి మంచివేకావచ్చు గానీ, ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ఆప్యాయత, అనుబంధాలు మచ్చుకైనా కనిపించవచ్చు. విడిగా ఉండి మమతానురాగాలను కొనసాగిస్తారనే అంటే అదీలేదు. జీవితాలన్నీ యాంత్రికంగా మారాయి. ఎవరిజీవితం, ఎవరి వ్యవహారం వారిదే.. ఎవరికి తల్లిదండ్రులు, అత్తామామలు అక్కరలేదు. దీన్ని బట్టి చూస్తే 40ఏండ్ల క్రితం చెన్నూరి వెంకట్రాములు ఆలోచన సరైందే అని పిస్తున్నది. నేటి విద్యావంతులు వెంకటరామయ్య ఆలోచనలను సైతం విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
మా తల్లిదండ్రులను ఎన్నటికీ మరువం..
బతికుండగానే సమాధులను నిర్మించుకున్న మా తల్లిదండ్రులు గొప్పవాళ్లు. భిక్షాటన చేసినప్పటికీ, మమ్మల్ని పోషించి పెద్దవాళ్లను చేసిన తల్లిదండ్రులను మేం ఎన్నటికీ మరువం. ఆయన దీపంతోనే నేడు చదువుకుని అక్కన్నపేట పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా. ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల సమాధుల దగ్గరికి పోయి దీపాలు పెట్టి పూజలు చేస్తున్నం.
– చెన్నూరి రామస్వామి, హెడ్‌కానిస్టేబుల్, హుస్నాబాద్