సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 6: సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.శరత్ అధికారులను ఆదేశించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు, నిమ్జ్ ప్రాజెక్టు, జాతీయ రహదారుల పనులకు సంబంధించి భూ సేకరణ పురోగతి, జాప్యానికి గల కారణాలు, ఆయా ప్రాజెక్టుల కింద ఫైనల్ అవార్డుల పరిస్థితి, పెండింగ్లో ఉన్న చెల్లింపులు, తదితర అంశాలపై బుధవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం జరగొద్దన్నారు. అవార్డ్ పాసైన వాటికి చెల్లింపులు చేయాలని సూచించారు. క్లియర్గా ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేయాలని రెవెన్యూ డివిజినల్ అధికారులకు ఆదేశించారు. పెగ్ మార్కింగ్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్, రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని సూచించారు. ఆయా ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, నీటి పారుదల, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, టీఎస్ఐపాస్, నిమ్జ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
రైతుబంధు డబ్బులు పాత బకాయి కింద జమ చేయొద్దు
పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతుబంధు డబ్బును బ్యాంకర్లు పాత బకాయీల కింద జమ చేసుకోవద్దని కలెక్టర్ శరత్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధుతో ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నదని, ఆ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నదని తెలిపారు. కొందరు బ్యాంకు మేనేజర్లు పాత బకాయిల కింద ఈ డబ్బులు జమ చేసుకుంటున్నట్లు దృష్టికి వచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుబంధు డబ్బును జమ చేసుకోకూడదని స్పష్టం చేశారు.
వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ శరత్ సూచించారు. కలెక్టర్ చాంబర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. హాస్టళ్లలో ఈ సంవత్సరం అడ్మిషన్లు, ఉన్న ఖాళీలు, పదో తరగతి ఉత్తీర్ణత ఫలితాలు, స్కాలర్షిప్స్, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇస్తున్న మెనూను అన్ని వసతి గృహాల్లో అమలు చేయాలన్నారు. హాస్టళ్ల వార్డెన్లు ఆయా ఏరియాలోని పిల్లలను హాస్టళ్లలో చేర్పించాలన్నారు. క్రమం తప్పకుండా జిల్లా అధికారులు హాస్టళ్లను సందర్శించాలన్నారు. ఆయా హాస్టళ్లలో అన్ని హాస్టళ్లలో మునగ, కరివేపాకు, పొప్పడి, నిమ్మ, జామ, బత్తాయి, మామిడి లాంటి మొక్కలు పెడితే బాగుటుందన్నారు. సమావేశంలో షెడ్యూల్ట్ కులాల అభివృద్ధి శాఖ డీడీ అఖిలేశ్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖాధికారి జగదీశ్, గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫిరంగి, సోషల్ వెల్ఫేర్ ఆర్సీవో భీమయ్య, ఎస్టీ వెల్ఫేర్ ఆర్సీవో కల్యాణి పాల్గొన్నారు.