మెదక్ మున్సిపాలిటీ, జూలై 1 : రేషన్ దుకాణాల్లో పాత ఈ-పాస్ మిషన్ల కారణంగా రేషన్ దారులు బియ్యానికి వెళ్తే నెట్ సౌకర్యం లేక, థంబ్, ఐరిష్ పనిచేయక రోజుల తరబడి రేషన్ షాపుల చుట్టూ తిరిగేవారు. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4జీ సేవలు అందుబాటులో ఉండేలా అత్యాధునిక సేవలు అందించే ఈ-పాస్ మిషన్లను రేషన్ డీ లర్లకు అందిస్తున్నది. 4జీ సదుపాయం ఉండడంతో థంబ్, ఐరిష్ క్షణాల్లో రికార్డు కావడంతో తొందరగా రేషన్ పొందే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ -పాస్ మిషన్తో తూకం వేసే కాంటాకు అనుసంధానమై ఉంటుంది. ఈ నెల నుంచి ఆధునిక ఈ-పాస్ మిషన్లతో డీలర్లు కార్డుదారులకు బియ్యం ఇవ్వనున్నారు. నూతన ఈ-పాస్ మిషన్ల వినియోగంపై జూన్ 24న మెదక్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో రేషన్ డీలర్లకు విజనోటెక్ సంస్థ శిక్షణనిచ్చింది. అనంతరం ఈ-పాస్ మిషన్లు అందజేశారు.
జిల్లాలో 521 రేషన్ దుకాణాలు…
మెదక్ జిల్లాలో 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొ త్తం 2,16,568 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో తెలుపు కార్డులు 2,02,587 ఉండగా, అంత్యోదయ కార్డులు 13,906, అన్నపూర్ణ కార్డులు 75 ఉన్నాయి. జూన్ నెల నుంచి ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తుండగా, ఈ-పాస్ సేవలు త్వరితగతిన అందనున్నాయి.