
వెల్దుర్తి, నవంబర్ 22 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్ పరిశ్రమ భూకబ్జాపై జరుగుతున్న సర్వేను మెదక్ కలెక్టర్ హరీశ్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేతీరు, హద్దుల ఏర్పాటు, రైతుల వాంగ్మూలాల నమోదుపై మెదక్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ మాలతి, సర్వే డీఐ లక్ష్మీసుజాత, ఆర్ఐ ధన్సింగ్లతోపాటు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు హద్దులు చూపించాలని, పరిశ్రమ వారు రోడ్డును మూసివేశారని, భూముల పొజిషన్ మారిందని, పలు భూ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వగా, వాటిని తీసుకున్న కలెక్టర్.. పరిశీలించి సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ మాలతిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ జమున హ్యాచరీస్ భూ కబ్జాకు పాల్పడినట్లు రైతులు ఇచ్చిన ఎనిమిది సర్వే నంబర్లలో క్షేత్రస్థాయిలో సర్వే డీఐ లక్ష్మీసుజాత ఆధ్వర్యంలో సర్వే పూర్తి అయిందన్నారు. సర్వేలో భాగంగా సోమవారం హక్కీంపేట గ్రామపరిధిలోని సర్వే నం.97లో సబ్ డివిజన్లను గుర్తించి హద్దులను ఏర్పాటు చేశారన్నారు.
రైతులు ఫిర్యాదు ఇచ్చిన అచ్చంపేట శివారులోని 77,78, 79,80,81, 82, 130, హకీంపేట శివారులోని 97 సర్వే నెం.లో సర్వేలు పూర్తి అయ్యాయని, రెండు, మూడు రోజుల్లో సర్వే డీఐ రిపోర్టు ఇస్తారని, ఆర్డీవో, తహసీల్దార్లు సర్వే పూర్తైనట్లు ఇచ్చే రిపోర్టుల ఆధారంగా సర్వే నివేదిక ఇస్తామన్నారు. ఇదిలా ఉండగా అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన మరికొంత మంది రైతులు తమ వద్దకు వచ్చి నిర్మాణాలు చేపట్టడం, భూములు చదును చేయడం, కబ్జాలకు పాల్పడడంతో మా హద్దులు చెరిగిపోయాయని, మా భూములు తెలియడం లేదని, సర్వేలు నిర్వహించి మా భూములు చూపించాలని కోరుతూ వినతులు ఇచ్చారన్నారు. ఆయా భూముల సర్వే కోసం నోటీసులు ఇచ్చా మని, త్వరలోనే చుట్టుపక్కల భూములలో సైతం సర్వే చేస్తామని తెలిపారు. పూర్తి స్థాయి సర్వేలతో మొత్తం ఎంత భూమి ఉంది, అందులో అసైన్డ్ భూమి ఎంత, సీలింగ్ భూమి ఎంత, ఎంత కబ్జాకు గురైంది అనే వివరాలు తెలుస్తాయన్నారు. పరిశ్రమ వ్యర్థాలు, దుర్వాసనతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళల్లో వస్తే కాలుష్యం, దుర్వాసన తెలుస్తుందని, మూడు రోజుల క్రితం గ్రామస్తులు తనకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై పీసీబీ అధికారులు నమూనాలు సేకరించారని, వారి రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు.
జమున హ్యాచరీస్ పరిశ్రమ ప్రతినిధులపై ఆగ్రహం…
జమున హ్యాచరీస్ నిర్మాణాల్లో భాగంగా హకీంపేట శివారులోని సర్వే నెం.111లో ఎలాంటి నాలా కన్వర్షన్ లేకుం డా నిర్మాణాలు చేపట్టారు. సోమవారం సాయంత్రం రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ వద్దకు పరిశ్రమ ప్రతినిధులు వచ్చి, నాలా కన్వర్షన్‌పై వినతిపత్రం ఇవ్వడానికి రాగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినతిపత్రం తీసుకోలేదు. నాలా కన్వర్షన్ నిర్మాణాలు చేపట్టక ముందు తీసుకోవాలని, ప్రస్తుతం సర్వేలు జరుగుతున్న సమయంలో వినతి పత్రం ఎలా ఇస్తారంటూ పరిశ్రమ ప్రతినిధులపై మండిపడ్డారు.